రామ్ గోపాల్ వర్మ అంటేనే కేరాఫ్ కాంట్రవర్సీ అంటారు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా ఈయన తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలైంది. దీనికి టాక్ ఎలా ఉంది.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది పక్కనబెడితే ఇందులో కొన్ని సన్నివేశాలు మాత్రం ఇప్పుడు తెలుగుదేశం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పాత్రలను ఆయన డిజైన్ చేసిన విధానం.. చూపించిన విధానం తెలుగు తమ్ముళ్లలో మంట పుట్టిస్తున్నాయి. అసలు మా నాయకుడిని అలా చూపిస్తావా అంటూ మండిపడుతున్నారు తెలుగుదేశం నాయకులు.
అయితే అవేం పట్టించుకున్నా లేకపోయినా కూడా ఒక్క సన్నివేశం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. సినిమాలో దయనేని రమ అనే నాయకున్ని నడిరోడ్డు మీద నరికి చంపేస్తారు కొందరు రౌడీలు. అయితే ఆ పాత్ర దేవినేని ఉమ అని కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా కూడా ఇట్టే అర్థమైపోతుంది. వర్మ ఇది ఫిక్షన్ డ్రామా అని ఎన్ని డ్రామాలు ఆడినా కూడా అందులో సన్నివేశం చూస్తుంటే అన్నీ అర్థమైపోతాయి. మళ్లీ అందులో కూడా ఓ సంచలనం చూపించాడు ఈయన. సినిమాలో దయనేని రమను చంపించింది బాబు కోడలు రమణి అని చూపించాడు వర్మ.
అంటే అక్కడున్న కారెక్టర్ బ్రహ్మిణి అన్నమాట. అలా నారా లోకేష్, చంద్రబాబుతో పాటు చివరికి బాలయ్య కూతురు బ్రహ్మిణిని కూడా టార్గెట్ చేయడం తెలుగు తమ్ముళ్లకు అస్సలు నచ్చడం లేదు. ఫిక్షన్ పేరుతో ఇష్టమొచ్చినట్లు తీస్తావా అంటూ ఆయనపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. దేవినేని ఉమను పోలిన వ్యక్తిని చంపేయడం.. అందులో బ్రహ్మిణి పాత్రను పోలిన రమణి హస్తం ఉందనడం వెనక వర్మ అంతరార్థం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అడిగితే ఇది ఫిక్షన్ డ్రామా అంటున్నాడు. మొత్తానికి ఈయన చేసిన అమ్మరాజ్యంలో సినిమా మళ్లీ కొత్త కాంట్రవర్సీలకు తెరతీస్తుంది. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nara Brahmani, RGV, Telugu Cinema, Tollywood