సినిమా ఇండస్ట్రీలో వారసులదే రాజ్యం. తాతలు, తండ్రులు ఉంటే నేరుగా వచ్చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వేలు విడిచిన చుట్టాలు కూడా వాళ్ల పేరు చెప్పుకుని వచ్చేస్తుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్లు ఎక్కువగానే ఉన్నా.. ఆ కాయలు రుచిగా ఉంటేనే అమ్ముడవుతున్నాయి. అంటే ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా టాలెంట్ లేకపోతే అంతే సంగతులు. అలా నందమూరి, అక్కినేని వంశం నుంచి వచ్చిన వారసులు కూడా సక్సెస్ కాలేక సైలెంట్ అయిపోయారు. కొందరు మాత్రం తమ పెద్ద వాళ్లు వేసిన బాటలో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరోల్లో 80 శాతం మంది వారసులే. ఇదిలా ఉంటే బ్రహ్మానందం లాంటి కమెడియన్లు కూడా తమ కొడుకులను హీరోలుగా లాంఛ్ చేసారు. అలాంటిది స్టార్ హీరో అయ్యుండి.. ఒకప్పుడు సంచలన విజయాలు అందుకున్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం తన వారసుడు బాలాజీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేయలేకపోయాడు. అచ్చం చూడ్డానికి తండ్రి మాదిరే ఉండే బాలాజీ ప్రసాద్ ఎందుకు హీరో కాలేకపోయాడు అంటే మాత్రం చాలా కారణాలున్నాయి. నిజానికి రాజేంద్ర ప్రసాద్‌కు తన వారసుడిని ఇండస్ట్రీకి తీసుకురావాలని చాలా కాలంగా కోరిక ఉండేది.
ఆ కోరిక నెరవేర్చుకోడానికి తన కొడుకు బాలాజీ ప్రసాద్‌ను హీరోగా పెట్టి ఓ సినిమాను కూడా మొదలు పెట్టాడు. ఆ సినిమాకు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించగా నిధి ప్రసాద్ నిర్మాతగా ఉన్నాడు. కానీ షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే కొన్ని అనివార్య కారణాలతో బ్రేక్ పడింది. దాంతో బాలాజీ ప్రసాద్‌కు సినిమాలపైనే ఆసక్తి పోయిందని తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు చెప్పినా.. ఎంత ఒప్పించినా తండ్రి మాట మాత్రం నిలబెట్టలేకపోయాడు బాలాజీ ప్రసాద్. మొదటి సినిమా ఆగిపోవడంతోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి తనకు నటన వద్దంటూ సినిమాలకు గుడ్ బై చెప్పాడని ఇండస్ట్రీలో వార్తలున్నాయి.
తనకు అంత స్టార్ డమ్ ఉన్నా.. నటకిరీటి అనే బిరుదు ఉన్నా కూడా తనయుడిని సినిమాల్లోకి తీసుకురాలేకపోవడం రాజేంద్ర ప్రసాద్‌కు మాత్రం ఇప్పటికీ తీరని కలే. ఎంతోమంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా తమ కొడుకులను హీరోలను చేస్తుంటే.. అందమైన కొడుకు ఉన్నా కూడా ఏం చేయలేక అలా చూస్తున్నాడు రాజేంద్రుడు పాపం. తానే నిర్మాతలను సెట్ చేస్తానని చెప్పినా.. అంత కుదిరని పక్షంలో నిర్మాతగా మారతానని హామీ ఇచ్చినా కూడా బాలాజీ ప్రసాద్ నో చెప్పడంతో ఆశలు వదిలేసుకున్నాడు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం ఈయన విదేశాలకు ఎక్స్‌పోర్ట్ బిసినెస్ మెన్‌గా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajendra Prasad, Telugu Cinema, Tollywood