రివ్యూ : వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)
నటీనటులు : చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా,నాజర్, సత్యరాజ్ తదితరులు..
ఎడిటర్: నిరంజన్ దేవరమనే
సినిమాటోగ్రఫీ: ఆర్ధర్.ఏ.విల్సన్
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యెర్నెనీ, వై.రవి శంకర్)
దర్శకత్వం: K.S.రవీంద్ర ( బాబీ కొల్లి)
విడుదల తేది : 13/1/2023
గాడ్ ఫాదర్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ మరో కథానాయకుడిగా నటించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. రీ ఎంట్రీలో ఖైదీ నంబర్ 150 తర్వాత పూర్తి స్థాయి చిరు.. తన ఇమేజ్‌కు తగ్గట్టు చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
మన దేశంలో అత్యంత కరుడుగట్టిన మోస్ట్ వాండెట్ స్మగ్లర్ సాల్మన్ సీజర్ (బాబీ సింహా). ఇతన్ని మన భారత ‘రా’ ఏజెంట్స్ ఎంత కష్టపడి పట్టుకొని మన దేశానికి తీసుకొచ్చే క్రమంలో వాళ్లు ప్రయాణిస్తున్న ఎయిర్ ప్లేన్ క్రాష్ అయి ఆంధ్ర ప్రదేశ్‌లో మారేడిమిల్లిలో దిగుతుంది. కరుడుగట్టిన మోస్ట్ వాండెట్ క్రిమినల్ స్థానికంగా ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంచుతారు. అతన్ని విడిపించుకోవడాని అతని అన్న మైఖేల్ సీజన్ అలియాస్ కాలా (ప్రకాష్ రాజ్) అక్కడ పోలీసులను చంపి తమ్మడిని విడిపించుకొని మలేషియాకు తీసుకెళతాడు. సాల్మన్‌ను పట్టుకొని ఇండియాకు తీసుకురావడానికి అక్కడ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే సీఐ (రాజేంద్ర ప్రసాద్) అక్కడ లోకల్ మాస్ లీడర్ అయిన వాల్తేరు వీరయ్య (చిరంజీవి)ను మలేషియా తీసుకెళతాడు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సహాయంతో సాల్మాన్‌తో పాటు అతని అన్న మైఖేల్‌ను మన దేశానికి తీసుకొచ్చాడా.. ? ఈ క్రమంలో వాల్తేరుకు అసిస్టెంట్ కమిషనర్‌గా వచ్చిన విక్రమ్ సాగర్ (రవితేజ)కు వాల్తేరు వీరయ్యకు మధ్య అనుబంధం ఏమిటి ? అసలు స్మగ్లర్లు పట్టుకోవడానికి వీరయ్యను మలేషియాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదే ‘వాల్తేరు వీరయ్య’ స్టోరీ.
కథనం, టెక్నీకల్ విషయానికొస్తే..
దర్శకుడు బాబీ (కే.యస్.రవీంద్ర) ఓ అభిమానిగా చిరంజీవిని ఎలా చూపిస్తూ ఆడియన్స్‌ను పూనకాలు తెప్పించవచ్చో ఈ సినిమాను చూస్తే తెలుస్తోంది. ఇప్పటి వరకు మనం ఎన్నో సినిమాల్లో చూసిన పరమ రొటీన్ స్టోరీనే మాస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చెప్పడంలో ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహాలో చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ను ఈ సినిమాలో బాగానే వాడుకున్నాడు. అంతేకాదు ఖైదీ 150 తర్వాత ఆ తరహాలో ఈ సినిమాలో చిరంజీవి మాస్ స్టెప్స్ అభిమానులను అలరిస్తాయి. మాస్ మసాలా సినిమా అంటే లాజిక్‌తో పనిలేదు. అదే బాబీ చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో లాజిక్‌తో పనిలేకుండా మ్యాజిక్ చేసాడనే చెప్పాలి. లాజిక్ విషయానికొస్తే.. ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్‌లో నేవి (కోస్ట్ గార్డ్) వాళ్లను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇక భారత నేవి దగ్గర సముద్రంలో తుఫాను వచ్చిన చెక్కు చెదరకుండా నీళ్లలో వెళ్లే సబ్‌మెరైన్స్ ఎన్నో ఉంటాయి. వాటి సహాయంతో సముద్రంలో వెళ్లే స్మగ్గర్లును ఈజీగా పట్టుకోవచ్చు. కానీ వాళ్లు తమ అధికారులను విడిపించమని వాల్తేరు వీరయ్య దగ్గరకు వస్తారు. దర్శకుడు ఈ విషయంలో కాస్త ఆలోచిస్తే బాగుండేది.
మరోవైపు సినిమాలో ‘రా’(RAW) ఏజెంట్స్‌కు సాధ్యం కానీ పనిని హీరో చేసి చూపించడం.. అందులో రా సహాయం కూడా తీసుకుంటాడు అది వేరే విషయం అనుకో. ఒక సన్నివేశంలో వాల్తేరు వీరయ్య ఫోటో తీసి అతనెవరో కనుక్కొమని తనకు తెలిసిన పోలీసుల ద్వారా అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుంటాడు. అదే సమయంలో అతని పక్కన ఉండే పోలీస్ ఆఫీసర్ (రాజేంద్ర ప్రసాద్) ఫోటో తీసి అతని బయోడేటా అడగడు. అక్కడ విలన్ లాజిక్ మిస్ అయినట్టు కనిపిస్తోంది. సినిమాలో వెతుక్కుంటూ పోతే ఇలాంటి లాజిక్‌కు అందని సన్నివేశాలు ఎన్ని ఉన్న.. చిరంజీవిలో అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్ని ఇందులో ఏరికోరిపేర్చి మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టాడు. అటు రవితేజ క్యారెక్టర్‌ను ఇందులో స్ట్రాంగ్‌గానే రాసుకున్నాడు. కథలో మెయిన్ పిల్లర్. శృతి హాసన్ క్యారెక్టర్‌ను బాగానే డిజైన్ చేసాడు. వీళ్లిద్దరి మధ్య సీన్స్ ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ పాటలు ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. ఆర్ఆర్ బాగుంది. ఆర్ధర్ ఏ. విల్సన్ ఫోటోగ్రఫీ బాగుంది. చిరంజీవి, శృతి హాసన్‌ను సినిమాలో బాగానే చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
చిరంజీవి.. రీసెంట్‌గా చేసిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో కాస్త గంభీరమైన పాత్రలు చేసిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య మూవీలో తన మార్క్ మాసిజం ఏంటో చూపించాడు. చిరు నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏజ్‌లో కూడా యాక్షన్, కామెడీతో పాటు ఎమోషన్స్, డాన్స్ అన్నింటిలో అభిమానులు ఆశించేలా అందించారు. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం స్క్రీన్ పై కనబడింది. రవితేజ విక్రమ్ సాగర్ అనే అసిస్టెంట్ కమిషనర్ పాత్రలో ఈ సినిమాలో మరోసారి తనదైన హీరోయిజంతో చెలరేగిపోయాడు. చిరుతో పోటాపోటీగా నటించాడు. వీళ్లిద్దరిపై పూనకాలు లోడింగ్.. అభిమానులకు నిజంగానే పూనకాలు తెప్పించింది. శృతి హాసన్ ఇందులో కాస్త చెప్పుకోదగ్గ పాత్ర లభించింది. ఇక విలన్స్‌గా నటించిన ప్రకాష్ రాజ్, బాబీ సింహాలు తమదైన విలనిజంతో హీరోయిజం ఎలివేట్ అయ్యేలా యాక్ట్ చేసారు. మిగతా పాత్రల్లో యాక్ట్ చేసిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్
చిరు స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, డాన్స్ మూమెంట్స్
రవితేజ మార్క్ నటన
ఫోటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
సెకండాఫ్ ల్యాగ్
లాజిక్‌కు అందని సన్నివేశాలు
చివరి మాట: మెగా మార్క్ మాస్ మసాలా
రేటింగ్ : 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Mythir Movie Makers, Ravi Teja, Shruti haasan, Tollywood, Waltair Veerayya, Waltair Veerayya Movie Review