విశాల్ వచ్చే ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలియజేశాడు. హీరోగా తమిళనాడులోనే కాదు.. తెలుగులోనూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. కేవలం నటుడిగానే కాకుండా తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి పదవులను కూడా విశాల్ అలంకరించాడు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అసెంబ్లీ ఎన్నిల్లో తమిళనాడులోని ఏదో ఒక నియోజక వర్గం నుండి విశాల్ పోటీ చేస్తున్నాడు. విశాల్ ఏ నియోజక వర్గం నుండి పోటీ చేస్తాడనేది ఇంకా తెలియడం లేదు. అయితే ఇప్పటికే విశాల్ తన గెలుపు కోసం తన అభిమాన సంఘాల ప్రతినిదులతో మాట్లాడుతున్నారట. అయితే విశాల్ రాజకీయాల్లోకి రావాలనుకునే కోరిక ఇప్పటిదేం కాదు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన అనంతరం జరిగిన ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే విశాల్‌ను నామినేట్ చేసిన వాళ్లలో కొంత మంది వెనక్కి తగ్గడంతో విశాల్‌లో ఉప ఎన్నిక బరిలో నుండి తప్పుకున్నాడు. అయితే ఈసారి అలాంటి తప్పు జరగకుండా విశాల్ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాడట.
అయితే విశాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటాడని తెలియగానే దర్శకుడు చేరన్, సీనియర్ దర్శక నిర్మాత రాజేంద్రన్ తదితరులు విశాల్ చర్యను తప్పుపడుతున్నారు. రీసెంట్గా జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో విశాల్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని, నడిగర్ సంఘం, నిర్మాతల మండలి రాజకీయ పార్టీలు కాదని, ఒకవేళ విశాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ విశాల్ నుండి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. మరి తనపై ఇతరులు చేస్తున్న డిమాండ్స్‌కు అనుగుణంగా విశాల్ రాజీనామా చేస్తాడో లేదో చూడాలి. మరో పక్క నడిగర్ సంఘంలో దాదాపు ఏడెనిమిది కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశాడని కూడా విశాల్‌పై ఆరోపణలున్నాయి. నడిగర్ సంఘ భవనాన్ని ఎప్పుడు నిర్మిస్తారో తెలియడం లేదు. వీటన్నింటికీ కూడా విశాల్ సమాధానం ఇవ్వడం లేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే..తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువాడైన విశాల్ కుటుంబం.. ప్రారంభం నుండి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. పందెంకోడి, పొగరు, భరణి సహా చాలా విశాల్ చిత్రాలు తెలుగులో అనువాదమై ఆదరణను పొందినవే. ప్రస్తుతం చక్ర సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో విశాల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు డిటెక్టివ్ 2 సినిమా చిత్రీకరణను పూర్తి చేసే పనిలోనూ తలమునకలై ఉన్నాడు విశాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vishal, Tamil Nadu Lok Sabha Elections 2019, Tamil nadu Politics