‘అజ్ఞాతవాసి’ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. అప్పటి వరకు తెలుగు సినిమా కనీవినీ ఎరుగని నష్టాలను ‘స్పైడర్’ సినిమా తీసుకొస్తే.. అదొచ్చిన ఆర్నెళ్లలోపే మరో గాయాన్ని రేపాడు పవన్ కళ్యాణ్. పండగ సినిమాలు బోల్తా కొట్టడం కొత్తేం కాదు.. కానీ చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ కావడం మాత్రం నిజంగా కొత్తే. గత సంక్రాంతి నుంచి ఇది మరీ ఎక్కువ అయిపోతుంది. గత ఏడాది సంక్రాంతి పండక్కి ఆకాశమంత అంచనాలతో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు బయ్యర్లు.
‘బాహుబలి’ రికార్డులను కూడా తిరగరాస్తుందేమో అనేంత నమ్మకంతో ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. కానీ తొలి రోజు తొలి షోకే ఊహించని విధంగా డిజాస్టర్ అయిపోయింది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ చేసిన ఈ సినిమా ఏకంగా 60 కోట్ల నష్టాలు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లు రోడ్డు మీదకు లాగేసింది. ఇక మళ్లీ ఏడాది తిరిగేసరికి ఈ సంక్రాంతికి కూడా మెగా హీరో మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు బాబాయ్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు అబ్బాయి అంతకు మించి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.
రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ఈ సంక్రాంతికే విడుదలైంది. జనవరి 11న వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు 26 కోట్లు షేర్ వసూలు చేసినా కూడా రెండో రోజుకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కనీసం ఐదు కోట్లు కూడా తీసుకురాలేదు ‘వినయ విధేయ రామ’. మరోవైపు బోయపాటి శ్రీను, రామ్ చరణ్ ఉన్నారనే ధైర్యంతో ఈ సినిమాను ఏకంగా 95 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ‘రంగస్థలం’ 125 కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు సంక్రాంతి సెలవుల్లో కూడా ‘వినయ విధేయ రామ’ కూడా ఇదే మ్యాజిక్ చేస్తాడని నమ్మారు బయ్యర్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.
రామ్ చరణ్ సినిమా బాబాయి ‘అజ్ఞాతవాసి’కి పోటీగా నష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. 40 కోట్ల షేర్ తీసుకువచ్చినా కూడా ఇంకా 55 కోట్లు బాకీ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఆ 40 కోట్లు కూడా వస్తాయా అనేది అనుమానంగానే ఉంది. ‘అజ్ఞాతవాసి’ మరిపించే సినిమా మళ్ళీ మెగా ఫ్యామిలీలోనే వస్తుందని.. అది కూడా ఇంత త్వరగా వస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. మరి దీనిపై రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boyapati Srinu, Pawan kalyan, Ram Charan, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama