Vijay Sethupathi Laabham movie reivew: విజయ్ సేతుపతి ‘లాభం’ సినిమా రివ్యూ.. ఆలోచన బాగుంది..!

విజయ్ సేతుపతి లాభం రివ్యూ (Vijay Sethupathi Laabham review)

Vijay Sethupathi Laabham movie reivew: విజయ్ సేతుపతి సినిమాలకు తెలుగులో కూడా ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. ఉప్పెన, మాస్టర్ లాంటి సినిమాలతో ఈయనకు ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. దాంతో విజయ్ సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే లాభం సినిమాను తెలుగులో విడుదల చేసారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..?

  • Share this:
నటీనటులు: విజయ్‌ సేతుపతి, శృతి హాసన్‌, జగపతి బాబు, సాయి ధన్సికా, రమేశ్‌ తిలక్‌, కలైరసన్‌ తదితరులు
సంగీతం: డి ఇమాన్‌
సినిమాటోగ్రఫీ: రామ్‌జీ
ఎడిటింగ్‌: ఎన్‌.గణేశ్‌ కుమార్‌, ఎస్పీ అహ్మద్‌
నిర్మాత: పి. ఆర్ముగం కుమార్‌, విజయ్‌ సేతుపతి
దర్శకత్వం: ఎస్‌.పి.జననాథన్

విజయ్ సేతుపతి సినిమాలకు తెలుగులో కూడా ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. ఉప్పెన, మాస్టర్ లాంటి సినిమాలతో ఈయనకు ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. దాంతో విజయ్ సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే లాభం సినిమాను తెలుగులో విడుదల చేసారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..?

కథ:
బద్రి (విజయ్ సేతుపతి) ఓ రైతు. ఆయన పండూరు రైతు సంఘం అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వుతాడు. అదే ఊళ్లో నాగభూషణం (జగపతి బాబు) అనే బిజినెస్ మ్యాన్ ఉంటాడు. రైతు సంఘాన్ని త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకుంటాడు భూషణం. వాళ్లకు బద్రి ఎదురు తిరుగుతుంటాడు. బద్రి అంటే భూషణంతో పాటు అతడి స్నేహితులకి అస్సలు నచ్చడు. దాంతో ఎలాగైనా బద్రిని దెబ్బ కొట్టాల‌ని ప‌న్నాగం ప‌న్నుతాడు నాగభూషణం. అదే సమయంలో బద్రి తన స్నేహితులతో కలిసి కొత్త తరహా సేద్యం మొదలు పెడతాడు. అది మిగిలిన వాళ్లకు బాగా నచ్చేస్తుంది. ఉమ్మడి వ్యవసాయం గొప్పతనం చూపిస్తాడు. ఆ క్రమంలోనే కొందరు భూస్వాముల చేతుల్లో ఉన్న ఇనాం భూముల్ని తీసుకుని ఊరి జ‌నానికి పంచి పెడ‌తాడు బద్రి. ఈ నేపథ్యంలోనే అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. బ‌యో డీజిల్ కంపెనీ పెట్టాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్న నాగ‌భూష‌ణం ఏం చేశాడు అనేది మిగిలిన కథ..

కథనం:
ఉమ్మడి వ్యవసాయం.. సరికొత్త పంథాలో సేద్యం చేయడం కాన్సెప్టుగా తెలుగులోనూ సినిమాలు వచ్చాయి. మొన్నటికి మొన్న శర్వానంద్ హీరోగా వచ్చిన శ్రీకారం సినిమాలో కూడా వ్యవసాయాన్నే ఎక్కువగా చూపించారు. ఇప్పుడు విజయ్ సేతుపతి సైతం ఇలాంటి కథతోనే వచ్చాడు. వ్యవసాయం గొప్పతనం చెప్పే కథతోనే వచ్చాడు. అయితే కథలో గొప్పతనం ఉన్నా కూడా కథనంలో మాత్రం అది కనిపించలేదు. దాంతో మంచి కథే అయినా కూడా సినిమా రొటీన్ అయిపోయింది. రైతు సంఘాన్ని చేతుల్లో పెట్టుకుని ఓ వ్యాపారవేత్త రైతులపై పెత్తనం చెలాయిస్తూ.. రైతు భూములతో పాటు వాళ్లపై అధికారాన్ని చెలాయిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో హీరో వచ్చి ఏం చేస్తాడనేది కథ. రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హీరో ఏం చేసాడు అనే సన్నివేశాలను ఇంకా బలంగా రాసుకోవచ్చు. కానీ ఆ సీన్స్ తీయడంలో కాస్త తడబడినట్లు అనిపించింది. హీరో రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రజల కోసం ఎలాంటి మంచి పనులు చేశాడు.. పెత్తం దారుల ఆటలని ఎలా అడ్డుకున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా వచ్చింది. విజయ్ సేతుపతి ఉన్నాడు కాబట్టి రొటీన్ కథ కూడా కాస్త ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది. ఆయన తన స్టామినాతో సినిమా రేంజ్ పెంచేసాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతు సంఘం నేపథ్యంలో సాగే డ్రామా ప్రేక్షకులను బాగానే అనిపిస్తుంది. కానీ ఒక సీన్ బాగుందే అనుకునే లోపు మరో సీన్ నిరాశ పరుస్తుంది. సినిమాలో అలాంటి స్క్రీన్ ప్లే లోపాలే ఇబ్బంది పెడుతుంటాయి. అయితే లాభం సినిమాలో మెచ్చుకోదగ్గ అంశం ఇనాం భూముల వెన‌క చ‌రిత్ర‌.. రైతులు ఇంకా పేద‌వాళ్లుగా మిగిలిపోవ‌డానికి కార‌ణాల్ని చాలా చక్కగా చూపించారు.

నటీనటులు:
ఈ సినిమాకి ప్రధాన బలం విజయ్ సేతుపతి నటన. ఆయనే కర్త కర్మ క్రియ. అన్నీ తానేయై లాభం సినిమాను ముందుకు నడిపించాడు. కానీ సినిమాకు మరో ప్రధాన మైనస్ డబ్బింగ్. కాస్త క్వాలిటీ డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది. అలాగే హీరోయిన్ శృతి హసన్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. జగపతి బాబు మరోసారి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించాడు. మిగిలిన వాళ్లు బాగానే ఉన్నారు..

టెక్నికల్ టీం:
ఈ చిత్రానికి కథే బలం.. కానీ కథనం మైనస్. మంచి కథ రాసుకున్నా కూడా కొన్నిసార్లు కథనం లోపాలతో యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది. లాభం సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇమాన్ సంగీతం బాగుంది. డిఓపీ పర్లేదు. ఎడిటింగ్ దగ్గరే అసలు సమస్యలు వచ్చాయి. స్క్రీన్ ప్లే లోపాల కారణంగా ఎడిటింగ్ కూడా అంత బాగా అనిపించదు. కథ చాలా బాగా రాసుకున్నాడు దివంగత దర్శకుడు ఎస్పీ జననాథన్. ఆయన చనిపోయిన తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఇబ్బందులు వచ్చినట్లున్నాయి. ఆ ప్రభావం సినిమాపై కూడా పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా విలువైన, ఎవరు చెప్పని విషయాలని ఈ సినిమాతో చెప్పాలని చూసాడు దర్శకుడు జననాథన్. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు విజయ్ సేతుపతి కూడా ఓ నిర్మాత.

చివరగా ఒక్కమాట:
లాభం.. ఆలోచన బాగుంది.. ఆచరణ తప్పింది..
రేటింగ్: 2.75/5
Published by:Praveen Kumar Vadla
First published: