విడుదలకింకా 3రోజులు... మార్కెట్లో ‘గీతగోవిందం’ పైరసీ సీడీలు!

గుంటూరులో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి వద్ద హెచ్‌డీ ప్రింట్ కాపీలు... బయటికి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 12, 2018, 1:07 PM IST
విడుదలకింకా 3రోజులు... మార్కెట్లో ‘గీతగోవిందం’ పైరసీ సీడీలు!
‘గీత గోవిందం’ మూవీ పోస్టర్
  • Share this:
టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందినప్పటికీ, సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం మాత్రం వదలడం లేదు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా, పైరసీ చేసేవారికి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. సినిమా విడుదలయిన రోజే, ఆన్‌లైన్‌లో పైరసీ లింకులు ప్రత్యేక్షమవుతున్నాయి. అయితే తాజాగా పైరసీదారులు మరింతగా ముదిరిపోయారు. విజయ్ దేవరకొండ నటించిన ‘గీతగోవిందం’ సినిమాకి ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే, పైరసీ చేసేశారు.

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయిన విజయ్ దేవరకొండ, ‘ఛలో’ హీరోయిన్ రష్మికా మందనా జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఎలా వెళ్లిందో, తెలియదు కాని విడుదల కాకముందు మార్కెట్లోకి వచ్చేసింది ‘గీత గోవిందం’ సినిమా ప్రింట్. ఆన్‌లైన్‌లో పెడితే త్వరగా దొరికిపోతామని భావించిన పైరసీదారులు... పెన్‌డ్రైవ్‌లు, ఈమెయిళ్ల ద్వారా అక్రమంగా చేతులు మారుస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. అయితే సినిమా పైరసీ చేసి, చేతులు మారుస్తున్నది ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం విశేషం.

గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని నంబూర్ సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి వద్ద ‘గీత గోవిందం’ సినిమా సీడీలు, కాపీ ఉన్నట్టు సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర్నుంచి హెచ్.డీ ప్రింట్ సీడీలు, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి తనకు వీటిని అందచేశాడని అతను తెలిపాడు. దాంతో దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సిద్దమయ్యారు గుంటూరు పోలీసులు. అసలు సినిమా విడుదల కాకముందే, ప్రింట్ బయటికి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా హీరో విజయ్ దేవరకొండ ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ‘ఒక్కసారి కిందపోయినట్టుగా అనిపిస్తోంది. బాగా హర్టయ్యా, నిరుత్సాహపడ్డా... ఒక్కసారి కోపం వస్తోంది. ఇంకో సారి ఏడుపోస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ.


Published by: Ramu Chinthakindhi
First published: August 12, 2018, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading