అదేంటి.. హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ మళ్లీ హీరో కావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరగబోతుంది మరి. హీరో అయ్యాడు కానీ ఇప్పుడు చిరంజీవిలా హీరో అవుతానంటున్నాడు విజయ్. అదేంటి రెండు విజయాలు వచ్చినంత మాత్రానా విజయ్ అప్పుడే చిరంజీవి స్థానంపై కన్నేసేంత పెద్దోడు అయిపోయాడా..? అసలు మెగాస్టార్ ప్లేస్ ఎక్కడా.. విజయ్ దేవరకొండ ప్లేస్ ఎక్కడా అనుకుంటున్నారా..? అవును నిజమే కానీ ఇప్పుడు చిరు ప్లేస్‌పై విజయ్ దేవరకొండ కన్నేస్తున్న మాట కూడా నిజమే.
‘పెళ్లిచూపులు’తో ఏదో అనుకున్నా కూడా ‘అర్జున్ రెడ్డి’.. ‘గీతగోవిందం’.. ‘టాక్సీవాలా’ సినిమాలతో విజయ్ దేవరకొండ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 100 కోట్ల మార్క్ అందుకుని సంచలనం సృష్టించాడు ఈ హీరో. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చింది. ఇదిలా ఉండగా గీతాఆర్ట్స్, యువీ క్రియేషన్స్‌లో మరో సినిమాకు కూడా సైన్ చేసాడు. దాంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కబోయే బై లింగువల్ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ.
ఈ సినిమాను తమిళ్ నిర్మాత ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానుంది. నోటా సినిమాతో ఇప్పటికే తమిళనాట ఓ సినిమా ట్రై చేసి దెబ్బ తిన్నాడు విజయ్. అయినా కూడా మళ్లీ ధైర్యంతో ముందడుగేస్తున్నాడు ఈ హీరో. పైగా నయనతార కూడా ఉండటంతో రిస్క్ తీసుకుంటున్నాడు విజయ్. ఈ సినిమాకు హీరో అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ మధ్యే నాని తన సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకుంటేనే ఆడుకున్నారు మెగా ఫ్యాన్స్.
చిరంజీవి-విజయ బాపినీడు కాంబినేషన్లో 1984లో వచ్చిన సినిమా ఇది. ఈ టైటిల్ ఇప్పుడు విజయ్ దేవరొకండ వాడుకోవాలని చూస్తున్నాడు. విజయ్ లాంటి కుర్ర హీరోకు హీరో టైటిల్ బాగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు కూడా. అయితే ఈ మధ్య నాని పరిస్థితి చూసిన తర్వాత విజయ్ దేవరకొండ మాత్రం హీరో టైటిల్‌పై కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. ఆయన ఒప్పుకుంటే హీరో అయిపోయినట్లే. కానీ ఏదేమైనా చిరంజీవి టైటిల్ తీసుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. గతంలో చాలా మంది చిరు టైటిల్స్ తీసుకుని చతికినపడ్డ వాళ్లున్నారు. మరిప్పుడు విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Nani, Nayanatara, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda