రివ్యూ: విజయ రాఘవన్
నటీనటులు: విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్ర రాజు, ప్రభాకర్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: ఉదయ్ కుమార్
సంగీత దర్శకుడు: నివాస్ కె.ప్రసన్న
ఎడిటర్: విజయ్ ఆంటోని
నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ దర్శకుడు: ఆనంద కృష్ణన్
బిచ్చగాడు సినిమా తర్వాత తెలుగులో కూడా విజయ్ ఆంటోని సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆయన నటించిన రెండు మూడు సినిమాలు తెలుగులో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు విజయ రాఘవన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోని. మరి ఈ సినిమా ఎంత వరకు అంచనాలు ఉంటుందో చూద్దాం..
కథ:
విజయ రాఘవన్ (విజయ్ ఆంటోనీ) అరకులోని ఓ గ్రామంలో ఉంటాడు. విజయరాఘవన్ తల్లి ఊరి సర్పంచ్. ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒక మంచి చేయాలని అనుకుంటూ ఉంటుంది. అయితే అది గిట్టని వాళ్ళు ఆమె భర్తను చంపేస్తారు. ఈమె కూడా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు విజయ రాఘవకు జన్మనిస్తుంది. తన కొడుకును కలెక్టర్ గా చూడాలని కలలు కంటుంది హీరో తల్లి. అందుకే హైదరాబాద్ వచ్చి ఒక గవర్నమెంట్ కాలనీ లో ఉంటూ కష్టపడి చదువుకుంటాడు విజయ రాఘవన్. ట్యూషన్ చెప్తూ తన పని తాను చేసుకుంటాడు. కానీ అనుకోని విధంగా అక్కడ కాలనీలో ఉన్న సమస్యలు చూసి రాజకీయాల్లోకి వెళ్తాడు. దాని వల్ల ఐ.ఎ.ఎస్.కు అడ్డంకులు వస్తాయి. ఒకవైపు తల్లికిచ్చిన మాట.. మరోవైపు రాజకీయ నాయకుల ఒత్తిడి.. ఈ సమయంలోనే ఆ కాలనీకి కార్పొరేటర్ గా ఎన్నికవుతాడు. అక్కడ నుంచి అసలు సమస్య మొదలవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..
కథనం:
తల్లికిచ్చిన మాట కోసం కొడుకు కలెక్టర్ కావడం.. ఊరి సమస్యలు తీర్చడం.. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెరకెక్కిన విజయ రాఘవన్ కూడా అలాంటి కథే. కాకపోతే దానికి ట్రీట్మెంట్ వేరేలా ఇచ్చాడు దర్శకుడు ఆనంద్. ఈ సినిమాలో రాజకీయ నాయకుల ముసుగులో జరుగుతున్న అన్యాయాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. చిన్న చిన్న గ్రామాల నుంచి పట్టణాలకు వరకు రాజకీయ నాయకులు ఎలా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను ఎలా వాడుకుంటున్నారు.. వాళ్లు చేతివాటం ఎలా చూపిస్తున్నారు.. చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలు వీటి చుట్టూ అల్లుకున్నాడు. ముఖ్యంగా గవర్నమెంట్ కాలనీ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటాయి అక్కడ మనుషులు ఎంత దుర్భాగ్య పరిస్థితుల్లో బతుకుతున్నారు అనేది కూడా బాగా చూపించాడు. బ్రష్టు పట్టిన గవర్నమెంట్ కాలనిని హీరో శుభ్రం చేయడం.. అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడం ఇలాంటి సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. సామాజిక అంశాన్ని కాస్త కమర్షియల్ కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ రియలిస్టిక్ గా అనిపించినా సెకండాఫ్ మాత్రం చాలా వరకు సినిమాటిక్ గా సాగింది. కొన్ని సన్నివేశాలు మనం రెగ్యులర్ గా బయట చూసేవే ఉంటాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానాన్ని దర్శకుడు ఆనంద కృష్ణన్ చక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మరోవైపు మదర్ సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా దర్శకుడు మెచ్యూరిటీ చూపించాడు.
నటీనటులు:
విజయ రాఘవన్ పాత్రలో కనిపించిన విజయ్ ఆంటోని చక్కగా నటించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీమ్:
నివాస్ కె.ప్రసన్న సంగీతం బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది. విజయ్ ఆంటోనీ ఎడిటర్ గా కొంత వరకే పనితనం చూపించాడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఓవరాల్గా విజయ రాఘవన్ సామాజిక బాధ్యత ఉన్న ఒక మంచి కథ. కాకపోతే అందులో లోపాలు కూడా చాలానే ఉన్నాయి.
చివరగా ఒక్కమాట:
విజయ రాఘవన్.. సోషల్ మెసేజ్ కానీ కండిషన్స్ అప్లై..
రేటింగ్: 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aathmika, Ramachandra Raju, Vijay Antony, Vijaya Raghavan Review