Gaddalakonda Ganesh (Valmiki): ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) మూవీ రివ్యూ..

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గద్దలకొండ గణేష్’. ముందుగా ఈ సినిమాకు ‘వాల్మీకి’ టైటిల్‌ అనుకున్నారు. ఎన్నో వివాదాల నడమ విడుదలైన  ఈ సినిమాతో హరీష్ శంకర్..వరుణ్ తేజ్‌కు అనుకున్న సక్సెస్ అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: September 20, 2019, 2:39 PM IST
Gaddalakonda Ganesh (Valmiki): ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) మూవీ రివ్యూ..
‘గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ (Twitter/Photo)
  • Share this:
నటీనటులు: వరుణ్ తేజ్,అథర్వ, పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తదితరులు..

నిర్మాణం: 14 రీల్స్ ప్లస్

సంగీతం: మిక్కీ.జే.మేయర్

సినిమాటోగ్రఫీ: ఎ. బోస్



దర్శకత్వం: హరీష్ శంకర్

రేటింగ్: 2.75/5

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గద్దలకొండ గణేష్’. ముందుగా ఈ సినిమాకు ‘వాల్మీకి’ టైటిల్‌ అనుకున్నారు. ఇక ‘వాల్మీకి’ టైటిల్ పై వాల్మీకి బోయకు చెందిన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేసారు. హైకోర్టు టైటిల్ మార్చమని కోరడంలో సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందు ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరైన ‘గద్దలకొండ గణేష్’గా  పేరు మార్చారు. టైటిల్ మార్చినా.. చాలా చోట్ల ‘వాల్మీకి’ టైటిల్‌తోనే ఈ సినిమాను ప్రదర్శించారు. ఇన్ని వివాదాల నడమ విడుదలైన  ఈ సినిమాతో హరీష్ శంకర్..వరుణ్ తేజ్‌కు అనుకున్న సక్సెస్ అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..కథ విషయానికొస్తే.. 

రామాయణలో బోయవాడైన రత్నాకరుడు ఎలా వాల్మీకి మహర్షి అయ్యాడో.. అలా గ్యాంగ్ స్టర్‌గా ఉన్న గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్)..వాల్మీకిలా  మంచి వాడుగా ఎలా మారాడన్నదే ‘గద్దలకొండ గణేష్’(వాల్మీకి) సినిమా స్టోరీ.

నటీనటుల విషయానికొస్తే.. 

సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందు వరకు ‘వాల్మీకి’ టైటిల్‌తో ఉన్న ఈ సినిమా చివరి నిమిషంలో ‘గద్దలకొండ గణేష్‌’గా పేరు మార్చుకుంది. ఈ రకంగా చివరి నిమిషంలో పేరు మార్చుకున్న సినిమా గత కొన్నేళ్లలో ఏది లేదని చెప్పొచ్చు. ఈ సినిమా టైటిల్ పాత్రధారి గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ మంచి నటనను కనబరిచాడు. చేసే ప్రతి సినిమాలో కొత్త దనం ఉండేలా చూసుకుంటున్న వరుణ్ తేజ్..ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ పాత్రలో నటించాడనేకంటే జీవించాడనే చెప్పాలి. కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్.. కెరీర్ మొదట్లోనే ‘కంచె’ సినిమాలో సైనికుడి పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత ‘లోఫర్’ సినిమాలో మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. అలాగే ‘ఫిదా’ ‘తొలిప్రేమ’ సినిమాల్లో లవర్ బాయ్‌గా మెప్పించిన వరుణ్ తేజ్.. ఆ యేడాది సంక్రాంతి రిలీజైన ‘ఎఫ్ 2’లో తనదైన కామెడీ పండించాడు. ఇపుడు గద్దలకొండ గేణేష్‌ అనే గ్యాంగ్ స్టర్‌ పాత్రలో అదరగొట్టాడు. సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినా.. ఓవరాల్‌గా  వరుణ్ తేజ్‌కు మాత్రం గద్దలకొండ గణేష్ సినిమా అనేది పెద్ద మేకోవర్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎఫ్ 2 సినిమా తర్వాత  తెలంగాణ యాసలో మరోసారి వరుణ్ తేజ్ డైలాగ్ డెలవరి బాగుంది.  తమిళంలో బాబీ సింహా చేసిన రేంజ్‌లో కాకపోయినా.. ఉన్నంతలో వరుణ్ తేజ్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పాలి. మరోవైపు సెకండ్ హీరోగా నటించిన అథర్వ లుక్స్ బాగున్నాయి. తమిళంలో యూత్ హీరోగా రాణిస్తున్నఅథర్వ ఈ సినిమాలో మంచి నటననే కనబరిచాడు. ఇక శ్రీదేవి పాత్రలో నటించిన పూజా హెగ్డే ఉండేది కొంచెం సేపైనా.. ప్రేక్షకులను తనదైన గ్లామర్‌తో పాటు ఎల్లువచ్చే గోదారమ్మ పాటలో తన అందంతో అదరగొట్టింది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనిపించారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..

హరీష్ శంకర్.. గతంలో హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు ‘గబ్బర్ సింగ్‌’గా పూర్తిగా తనదైన శైలిలో తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. ఇపుడు తమిళంలో హిట్టైన ‘జిగర్తాండ’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి తెరకెక్కించాడు.  తమిళంలో బాబీ సింహాకు హీరోయిన్ ఉండదు. తెలుగులో మాత్రం మెగా హీరోల ఫ్యాన్స్‌ను సాటిస్ఫై చేయడానికి హరీష్ శంకర్ పూజా హెగ్డేను పెట్టి శోభన్ బాబు, శ్రీదేవిలు జంటగా నటించిన ‘దేవత’ సినిమాలోని ఎల్లువొచ్చే గోదారమ్మ పాటను పెట్టి మాస్‌‌‌ను ఆకట్టుకోవడంలో సఫలమయ్యాడు. తెలుగు నేటివిటికి తగ్గట్టు ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రా బార్డర్‌లో గద్దలకొండ ప్రాంతంలో జరిగే స్టోరీగా ‘గద్దలకొండ గణేష్’ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ లుక్ విషయంలోని కానీ.. క్యారెక్టర్ విషయంలో కానీ హరీష్ శంకర్ కేర్ బాగుంది. ఈ సినిమాలో ఇంకో హీరో అథర్వ.. గద్దలకొండను హీరోగా పెట్టి సినిమాను తీస్తాడు. తీరా టైటిల్ ‘వాల్మీకి’ అని చెబుతాడు. అపుడు హీరో ‘వాల్మీకి’ టైటిల్ ఏదో సత్రానికో ఇంకో గుడికో పెడితే బాగుంటుందని చెబుతాడు. చివరకు ఈ సినిమాను ‘సీటీమార్’ అనే టైటిల్ ఖరారు చేస్తారు. అలాగే ‘వాల్మీకి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా కు చివరకు గద్దలకొండ గణేష్ టైటిల్‌తో రిలీజ్ చేసాడు. ఈ సినిమాలో హరీష్ శంకర్ 80ల నాటి కాలాన్ని గుర్తు చేసాడు. అప్పట్లో ఆదివారం ఉదయం 9 గంటలకు మహాభారత్’ సీరియల్ వచ్చేది. ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలో ప్రోగ్రామ్ వచ్చేటపుడు డిష్ కదిలి డిస్టప్ అయ్యే విషయాలను ఈ సినిమాలో అప్పటి కాలాన్ని గుర్తు చేసాడు. కానీ అప్పట్లో డీడీ 8 లేదన్న విషయాన్ని మాత్రం మరిచిపోయినట్టున్నాడు. మొత్తానికి తనదైన టేకింగ్‌తో ఈ సినిమాను మాస్ మసాలా మూవీగా మలచడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రెండున్నర గంటల్లో కుదించాల్సిన సినిమాను మూడు గంటలు సాగదీయడం మాత్రం కొంచెం బోరింగ్ అనిపిస్తోంది. కెమరా మెన్ పనితనం బాగుంది. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ బాగుంది.

ప్లస్

గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ మేకోవర్

వరుణ్,పూజాలపై తీసిన రీమిక్స్ సాంగ్

ఫస్ట్ హాఫ్

మైనస్

సినిమా రన్ టైమ్

క్లైమాక్స్

అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు

మొత్తానికి మాస్‌ను మెప్పించే  ‘గద్దలకొండ గణేష్‌’ 
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు