Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 13, 2021, 4:38 PM IST
ఉప్పెన సినిమా (Uppena Movie)
ఇప్పటికే మెగా కుటుంబం నుంచి చాలా మంది వారసులు వచ్చారు. ఇప్పుడు మరొకరు వస్తున్నారు. నిజానికి గతేడాదే రావాల్సి ఉన్నా కూడా కరోనా వైరస్ కారణంగా ఆయన రాక కాస్త ఆలస్యం అవుతుంది. అతడే వైష్ణవ్ తేజ్ పంజా.. బాక్సాఫీస్ దగ్గర తన పంజా విసరడానికి వచ్చేస్తున్నాడు మెగా మేనల్లుడు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు ఈయన. వైష్ణవ్ నటిస్తున్న తొలి సినిమా ఉప్పెన టీజర్ విడుదలైంది. జనవరి 13న ఈయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. నిమిషం టీజర్లోనే దాదాపు కథ అంతా చెప్పేసారు. సముద్రపు అలల సవ్వడంతా హాయిగా సాగిపోయే ప్రేమకథ ఇది. సముద్రం అలలతో పాటు అప్పుడప్పుడూ సునామీ కూడా ఇస్తుంది కదా. అలా ఈ ప్రేమకథలో కూడా ఉప్పెనలు ఉన్నాయి.. ఉధృతాలు ఉన్నాయి. అందుకే టీజర్ అంతా హాయిగా ప్రేమకథను చూపించి చివర్లో మాత్రం విషాదాన్ని చూపించాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఉన్నాడు. హీరోయిన్ తండ్రి, సినిమాకు విలన్ ఆయనే.. అందుకే ఉప్పెనపై అంచనాలు భారీగా ఉన్నాయి.

విజయ్ సేతుపతి (vijay sethupathi)
ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన టీజర్‌తో దాదాపు కథ అర్థమైపోయింది. ఎన్నో సినిమాల్లో చూసినట్లు కోటలో రాణి తోటలో రాజా కాన్సెప్ట్ ఇది కూడా. పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథే ఉప్పెన. మీసాలు తిప్పుతూ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు ఈయన. మరోవైపు టీజర్లో వీడు ముసలోడు అవ్వకూడదే అంటూ హీరోయిన్‌తోనే డైలాగ్ చెప్పించాడు దర్శకుడు. సినిమాలో దాన్ని నిజం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ప్రేమకథకు బలైపోయే కుర్రాడి కథ అన్నమాట.
అవును.. ఉప్పెన హ్యాపీ ఎండింగ్ కాదు విషాదాంత ప్రేమకథ అని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్లను చంపేస్తారని.. పరువు హత్యల నేపథ్యంలోనే బుచ్చిబాబు కథ రాసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. తొలి సినిమాకే ఇలాంటి సాహసం చేస్తే మాత్రం వైష్ణవ్ తేజ్ ధైర్యానికి సలాం చెప్పాల్సిందే. ఫిబ్రవరి 5న సినిమా విడుదల కానుందని తెలుస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 13, 2021, 4:36 PM IST