యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే హీరోయిన్లు కూడా కుళ్లుకునే రేంజ్‌లో సంపాదిస్తుంది.. వాళ్ల కంటే ఎక్కువగా ఇమేజ్ తెచ్చుకుంది సుమ. వయసు 50కి చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ అదే స్టార్ డమ్ కంటిన్యూ చేస్తుంది. యాంకర్స్‌కు కలలో కూడా ఊహించనంత ఇమేజ్ తీసుకొచ్చింది ఈమె. సుమకు తెలుగులో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా అభిమానులు ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా సుమ అంటే క్రేజ్ ఉంది. అందుకే అప్పుడప్పుడూ ఫారెన్ టూర్స్ వెళ్లినపుడు సుమ క్రేజ్ చూసి అక్కడున్న వాళ్లు కూడా షాక్ అవుతుంటారు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదంతా అమెరికాలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని అమెరికా నలుమూలలా ఉన్న మహిళలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీఏ సంస్థ అధ్యక్షురాలు అపర్ణ అయ్యలరాజు తమ సంస్థ గురించి చెప్పుకొచ్చింది. అలాగే తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించింది. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తమ మాటలతో పాటు చేతలు, పాటలు, డాన్సులతో అలరించారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ‘సుమతో సందడి’ లో ప్రశ్నలు-సమాధానాలు అనే పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యాంకర్ సుమ కనకాల తనదైన శైలిలో షో అంతా అందర్నీ నవ్వించింది.. ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. 64 కళల్లో వినోదం ఒక కళ అయితే.. ఆ వినోదం ప్రేక్షకులకు అందించడం కోసం 64 కళలను వాడుకునే సుమ లాంటి యాంకర్ దొరకడం మన అదృష్టం అంటూ వాళ్లు ప్రశంసించారు. అంతేకాదు ఈమెకు సకల కళాభినేత్రి బిరుదు ఇవ్వడం సంతోషంగా ఉందని.. దానికి ఆమె పూర్తిగా అర్హురాలు అంటూ చెప్పుకొచ్చారు నిర్వాహకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.