టాలీవుడ్ లో సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె (Raghu Kunche) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రఘు కుంచె తండ్రి లక్ష్మీ నారాయణరావు (Raghu Kunche father Laxmi Narayana Rao) (94) ఈ నెల 17న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య కారణాలతో తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలోని గాదరాడలో లక్ష్మీ నారాయణరావు మృతి చెందారు. ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు కుంచెతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు.
రఘు కుంచె తండ్రి లక్ష్మీ నారాయణరావు తాగునీటి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే హోమియో వైద్యుడిగానూ ప్రజలకు సేవ చేశారు. అయితే తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసిన రఘు కుంచె.. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Miss you Nanna ???????? pic.twitter.com/SFU79xHlAY
— Raghu kunche ???????? రఘు కుంచే (@kuncheraghu) January 20, 2023
''నాన్న కాలం చేయటానికి కొన్ని గంటల ముందు, నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని ఫ్యామిలీతో ఉల్లాసంగా గడిపి.. దూరంగా ఉన్నవాళ్లను వీడియో కాల్‌లో పలకరించి, మర్నాడు పొద్దునే లేచి స్నానం చేసి పూజ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ చేసి, తనకు ఇష్టమైన మడత కుర్చీలో వెనక్కివాలి తన ప్రాణానికి ప్రాణమైన భగవద్గీత చదవుతూ అలానే శాశ్వత నిద్రలోకి జారిపోయారు. ఏ రోజూ ఎవ్వరినీ కించిత్ బాధ పెట్టని నాన్న.. అఖరి క్షణాల్లోనూ అలాగే వెళ్లిపోయారు... మిస్ యు నాన్న'' అని రఘు కుంచె తన పోస్టులో రాసుకొచ్చారు. రఘు కుంచె తండ్రి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బాచి సినిమాలో నటుడిగా కనిపించటమే కాకుండా ఓ పాట కూడా పాడారు రఘు కుంచె. ఆ తర్వాత బంపర్ ఆఫర్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఈ మధ్య నటుడిగా కూడా రాణిస్తున్నారు రఘు కుంచె. రుద్రవీణ, మా నాన్న నక్సలైట్, పలాస 1978, డిస్కో రాజా సినిమాల్లో రఘు నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor