జూన్ తొలి వారం నుంచి షూటింగ్స్ చేసుకోడానికి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇస్తుందని స్వయంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారం రోజుల కింద జరిగిన మీటింగ్‌లో తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలు వెళ్లి ఆయనతో తమ గోడు వెల్లబోసుకోవడంతో బాగా ఆలోచించి.. కొన్ని నియమ నిబంధనలు పాటించమని చెప్పి షూటింగ్ చేసుకోడానికి అనుమతులు ఇచ్చారు. అందులో భౌతిక దూరం ఉండాలి.. శానిటైజ్ చేసుకోవాలి.. ఎక్కువ మంది ఉండకూదు.. ఇన్డోర్ షూటింగ్ చేసుకోవాలి.. ముసలి వాళ్లకు ప్రవేశం లేదు లాంటి నియమాలు చాలానే ఉన్నాయి.
వీటితోనే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని ఇండస్ట్రీలు షూటింగ్స్ మొదలు పెట్టుకున్నాయి. తమిళ, కన్నడ సీరియల్స్ కూడా మొదలైపోయాయి. మరోవైపు బెంగాలీ వాళ్లు కూడా నేడో రేపో సై అంటున్నారు. కానీ తెలుగులో మాత్రం ఇంకా అటు వైపు అడుగులు పడటం లేదు. కారణం రోజురోజుకీ ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా వైరస్. తెలుగులో చాలా మంది నటీనటులు కరోనా ఓ గాడిన పడేవరకు కూడా తాము షూటింగ్స్‌కు రామని నిర్మాతలకు చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇండియాలో రోజుకు కనీసం 9 వేల కరోనా కేసులు వస్తున్నాయి.. చూస్తుంటే 10 వేల మార్క్ కూడా టచ్ అయ్యేలా కనిపిస్తుంది.
పైగా హైదరాబాద్‌లో అయితే మరీ దారుణంగా ఉంది కరోనా వైరస్. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా కోరల్లోనే ఉన్నాయి. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము షూటింగ్‌కు రాలేమని చెప్తున్నారు నటీనటులు. అందుకే అనుమతులు వచ్చినా కూడా నిర్మాతలు కూడా ఏం చేయలేకపోతున్నారు. సినిమా షూటింగ్స్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది. తెలుగులో చాలా మంది హీరోలకు వయసు 60 దాటిపోయింది. నలుగురు అగ్ర హీరోల వయసు కూడా 60పైనే. దానికి తోడు పవన్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా 50కి అటూ ఇటూగా ఉన్నారు.
ఇంకా చాలా మంది హీరోల వయసు కూడా 40కి చేరువలోనే ఉంది. కుర్ర హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించి షూటింగ్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. అందుకే మరికొన్ని రోజులు ఆలస్యమైనా పర్లేదు కానీ కరోనా కట్టడైన తర్వాతే పెట్టుకుందామని వాళ్లు చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అనుమతి ఉన్నా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. రాజమౌళి మాత్రం మరికొన్ని రోజుల్లోనే ట్రిపుల్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన పచ్చజెండా ఊపేస్తే ఆ తర్వాత అంతా ఆయన దారిలో అడుగేస్తారేమో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.