టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) (Jamuna Death) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. గత రాత్రి హైదరాబాద్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జామున భౌతిక ఖాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకురానున్నట్లు సమాచారం.
1936లో హంపిలో జన్మించారు జమున. 1953లో పుట్టిల్లు అనే సినిమాతో కెమెరా ముందుకొచ్చి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలతో నటించి మంచి గుర్తింపు పొందారు జమున. గులేబకావలి కథ, మూగమనసులు ఇలాంటి చిత్రాల్లో జమున నట విశ్వరూపం చూశారు తెలుగు ప్రేక్షకులు.
వెండితెరపై జమున నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగు నేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందారు జమున. అచ్చతెలుగు ఆడపిల్లలా ఆమె సినీ ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. మహానటి సావిత్రితో కలసి హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు.
తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి 198 సినిమాలు చేశారు జమున. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
సినీ తారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో జమున అగ్ర స్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం తనను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి అప్పట్లో జమున చెప్పారు. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు జమున.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jamuna, Tollywood, Tollywood actress