చాలా రోజులుగా ఏపీలో సినిమా ఇండస్ట్రీకి టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. అక్కడ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఇండస్ట్రీ పెద్దలకు నచ్చడం లేదనే వాదన కూడా ఉంది. దీనిపై కొందరు మాత్రమే బయటికి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే విమర్శల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ మంత్రి పేర్ని నానిని సినీ పెద్దలు కలిసారు. గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ అనుకున్న ఫలితాలు అయితే రావడం లేదు. ఇప్పుడు కూడా నానితో మీటింగ్ అయిపోయింది. ఇందులో కూడా ప్రధానంగా టికెట్ రేట్ల గురించి చర్చకు వచ్చిందని తెలిపారు. మంత్రి పేర్ని నానితో తెలుగు సినిమా నిర్మాతల భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
అక్కడ జరిగింది మంత్రి పేర్ని నాని మాటల్లో.. 'ఈ ఆన్‌లైన్ టికెటింగ్ అనేది మేమేదో కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం కంటే కూడా సినీ పరిశ్రమే ఆన్ లైన్ టికెటింగ్ కు బాగా అనుకూలంగా ఉంది. సహజంగా సినిమా టికెట్లపై ఒక నిర్దిష్ట విధానం అనేది ఉండాలి. అది చాలా అవసరం కూడా. అందుకే.. ఆన్ లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతుంది. కాబట్టి.. కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు.. ఇది మా ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టింది కాదు' అంటూ మంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు దిల్ రాజు సైతం తామే ఏపీ ప్రభుత్వాన్ని ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కోరామని.. దయచేసి ఇండస్ట్రీని వివాదాలు చేయకండంటూ చెప్పుకొచ్చాడు. ఇదే భేటీలో సినిమా పెద్దలు ఇండస్ట్రీలో తమ సమస్యలను కూడా వివరించారని తెలిపారు మంత్రి నాని. దీనిపై కూడా ఈయన ముచ్చటించారు. సినిమా పెద్దలు తమకు పెట్టిన అభ్యర్ధనల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది టికెట్ రేటు గురించే అని చెప్పారు నాని. టికెట్ రేటు తక్కువగా ఉంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తమకు సినీ పెద్దలు చెప్పినట్లు తెలిపారు పేర్ని నాని.
ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగింది.. అందుకే టికెట్ రేటుపై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా నిర్మాతలు కూడా విన్నవించారు. ఇప్పుడున్న టికెట్ రేట్లతో వ్యాపారం చేస్తే కచ్చితంగా నిర్మాతలకు నష్టం వస్తుందని నిర్మాతలు మొర పెట్టుకుంటున్నారు. అలాగే కరోనా కారణంగా సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని.. ఇప్పుడు థియేటర్స్ 50 శాతం ఆక్యూపెన్సీ ఉందని.. 100 శాతానికి పెంచాలని కూడా నిర్మాతలు కోరారని తెలిపారు పేర్ని నాని. అయితే వీటిపై నిర్మాతలకు స్పష్టమైన హామీలు మాత్రం ఏపీ మంత్రి నుంచి రాలేదు. దాంతో మరోసారి నిర్మాతల మొహాల్లో అల్పానందమే కనిపించింది. ఈ భేటీలో తెలుగు పరిశ్రమ నుంచి దిల్ రాజు, మైత్రి నవీన్, బన్నీ వాసు, దానయ్య లాంటి వాళ్ళు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.