లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలతోనే కాదు వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు. ఎప్పటికప్పుడు పోలీసు కేసులు పెడుతూనే ఉంటాడు ఈయన. తాజాగా మరోసారి ఈయన పేరు మార్మోగిపోతుంది. దానికి కారణం చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్‌లో ఉన్న తన రూమ్‌ను ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ ఖాళీ చేయించడానికి దౌర్జన్యం చేస్తున్నాడని ఈయన కేసు పెట్టడమే. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల కింద ఇళయరాజా కోరిక మేరకు ఎల్వీ ప్రసాద్ చెన్నై ప్రసాద్ స్టూడియోస్‌లోనే తనకంటూ ప్రత్యేకంగా ఓ రికార్డింగ్ థియేటర్ కట్టించి ఇచ్చాడు.
అందులోనే ఇళయరాజా పాటల కంపోజింగ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రికార్డింగ్ థియేటర్ ఖాళీ చేయించాలని సాయి ప్రసాద్ ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు కేసు పెట్టాడు రాజా. దీనిపై ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ స్పందించాడు. ఈ క్రమంలోనే ఈ సంగీత దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇళయరాజా అరాచకాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని ఆయన ఆరోపించాడు.
ఓ సినిమాకు పాట కంపోజ్ చేసినపుడు దాని సర్వహక్కులు ప్రతీ రూపాయి ఖర్చు పెట్టిన నిర్మాతకే ఉంటాయని చెప్తున్నాడు ప్రసాద్. కానీ ఇళయరాజా మాత్రం అలా కాకుండా తన పాటలు బయట ఎవరు పాడినా కూడా కేసులు వేస్తానని.. దాని రైట్స్ తన దగ్గరే ఉన్నాయని చెప్పడం బాగోలేదని చెప్పాడు కాట్రగడ్డ ప్రసాద్. అప్పట్లో ఎస్పీ బాలు దగ్గర కూడా ఇలాగే చేసాడని.. ఆయనపై కేసు వేసి అభాసుపాలయ్యాడని గుర్తు చేసాడు ఈయన.
ఆ తర్వాత ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారని చెప్పాడు. ఇదిలా ఉంటే ఇళయరాజాకు బాగా క్రేజ్ ఉన్న రోజుల్లో నిర్మాతలను భయపెట్టి ఆడియో రైట్స్ కూడా రాయించుకున్నాడని.. అలా సొంత ఆడియో కంపెనీ ఓపెన్ చేసి ఇప్పుడు లబ్ధి పొందుతున్నాడని చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం చెన్నై ప్రసాద్ స్టూడియోస్‌లో ఉన్న రికార్డింగ్ థియేటర్ తనదే అని ఇళయరాజా చెప్పడం మాత్రం అన్యాయం అంటున్నాడు ప్రసాద్.
ఓ సీనియర్ నిర్మాతగా.. అన్ని విషయాలు తెలిసిన వాడిగా తాను మాట్లాడుతున్నానని.. అప్పట్లో ఇళయరాజా స్వయంగా వెళ్లి ఎల్వీ ప్రసాద్‌ను అడిగితే ఆయనే ఓ రికార్డింగ్ థియేటర్ కట్టించి ఇచ్చాడని గుర్తు చేసాడు. దానిపై రాజాకు ఎలాంటి హక్కులు లేవని.. అది ఎన్ని రోజులు వాడుకుంటే దాని రెంట్ నిర్మాతలు కట్టేవాళ్లని చెప్పాడు ప్రసాద్. అంతేకానీ అది ఇళయరాజా సొంత ఆస్తి అని ఏ రోజు ఎల్వీ ప్రసాద్ చెప్పలేదని గుర్తు చేసాడు ఈయన.
అప్పట్లో సంగీత దర్శకుడు చక్రవర్తికి కూడా ఎవిఎంలో ఓ రికార్డింగ్ థియేటర్.. ఆ తర్వాత మరోచోట కూడా ఓ థియేటర్ ఉండేదని.. అంత మాత్రానికే అవి ఆయన సొంతం అయిపోవు కదా.. వాళ్లు వాడుకోడానికి ఇచ్చారంతే అంటున్నాడు ప్రసాద్. ఇప్పుడు ఇళయరాజా కూడా గతాన్ని మరిచిపోయి ఆ రికార్డింగ్ థియేటర్ తనదే అని చెప్పడం భావ్యం కాదని.. ఎల్వీ ప్రసాద్ మనవడిపైనే కేసు పెట్టడం అస్సలు సమంజసం కాదని చెప్పాడు కాట్రగడ్డ ప్రసాద్. ఇళయారాజా అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పాడు ఈయన. దయచేసి ఈ విషయంలో అనవసరపు రాద్ధాంతం చేయకుండా కేసు వెనక్కి తీసుకుంటే ఆయనకు మర్యాదగా ఉంటుందని చెప్పాడు ప్రసాద్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ilaiyaraaja, Telugu Cinema, Tollywood