సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు, హీరో బెల్లకొండ శ్రీనివాస్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రకాశం జిల్లావాసి అయిన వీఎల్ శరణ్ కుమార్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తన కుమారుడితో తీయబోయే చిత్రానికి సహ నిర్మాతగా ఉండటానికి 2018లో శరణ్ వద్ద సురేష్ విడతల వారీగా రూ.85 లక్షల తీసుకున్నాడు. ఆ సినిమా తెరకెక్కలేదని.. నమ్మించి మోసం చేశారని బాధితుడు శరణ్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. శరణ్ వాదనలు విన్న న్యాయస్థానం... బెల్లంకొండ సురేష్ తోపాటు ఆయన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాడు.
అందులో ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది పన్నిన కుట్రలో భాగమే నాపై నమోదు అయిన కేసు పెట్టారు. నాకు శరణ్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదు.. నాపై, నా కొడుకుపై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరణ్ ఒక్క పైసా మాకు ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరణ్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు. నేను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టకపోతే పరువునష్టం దావా వేస్తా. బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. పోలీసుల విచారణకు సహరిస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ సురేష్.
అలాగే ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్‌కు నోటీసులు ఇచ్చారు.. నా పిల్లలు జోలికి వచ్చాడు.. నా పిల్లలే నా పంచ ప్రాణాలు. శరణ్‌ను లీగల్‌గా ఎదుర్కొంటా.. అతనిపై పరువు నష్టం దావా వేస్తా.. ఏదన్నా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి.. నాకు కోర్టు నుంచి కానీ సీసీఎస్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు.. నాపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్‌కు నోటీసులు ఇచ్చారు. శరణ్ది మా ఊరే... పదేళ్ళ క్రితం పరిచయం.. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు.. శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతనే వచ్చి క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను.. బ్లాక్ మెయిల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు.. శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో బయట పెడతా..’ అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ సురేష్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.