Prakash Raj: ఆయన ఊసరవెల్లి.. పవన్ కల్యాణ్‌‌పై ప్రకాష్ రాజ్ విమర్శలు

పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్

GHMC Elections: ప్రజల మధ్య చిచ్చుపెట్టి.. హైదరాబాద్‌ (Hyderabad)ను దోచుకునేందుకే బీజేపీ (BJP) నేతలు వస్తున్నారని ప్రకాష్ రాజ్ (Prakash Raj) విమర్శించారు. వీళ్లకు హిందూ-ముస్లిం గొడవలు తప్ప.. అభివృద్ధి గురించి పట్టదని మండిపడ్డారు.

 • Share this:
  తెలంగాణలో జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలు సెగలు రేపుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ తలపడుతున్నాయి. సాధారణకు ఎన్నికలకు మించి స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. బస్తీ మే సవాల్ అంటూ.. నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. దుబ్బాక విజయంతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా కేంద్రమంత్రులు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు.. హైదరాబాద్‌ (Hyderabad)లో వాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పోరుపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash raj) స్పందించారు. ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ప్రజలంతా టీఆర్ఎస్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వైరస్‌లా.. దొంగల్లా.. నగరానికి వస్తున్న జాతీయ పార్టీల నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అన్నారు.

  ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (pawan kalyan) వైఖరిని ఆయన తప్పుబట్టారు. మీరు ఒక పార్టీకి అధినేత అయి ఉండి.. వేరొక పార్టీని ఎందుకు భుజాలపై ఎత్తుకుంటున్నారని విమర్శించారు. పవన్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తననూ నిరుత్సాహానికి గురి చేసిందన్నారు ప్రకాష్ రాజ్.

  ''పవన్ కల్యాణ్‌కుఏమైందో నాకు నిజంగా అర్ధం కావండం లేదు. ఆయన నిర్ణయం పట్ల నిరుత్సాహానికి గురయ్యా. మీరు నాయకుడు. జనసేన పార్టీ ఉంది. మీరు ఇంకో నాయకుడికి మద్దతు ఎందుు తెలుపుతున్నారు? మీ ఓట్ షేర్ ఏంటి? బీజేపీ ఓట్ షేర్ ఏంటి..? మీరు ఆయన భుజాలెక్కడం ఏంటి? 2014లో ఇంద్రుడు చంద్రుడు అని మీరే మద్దతు తెలిపారు. వారు ద్రోహం చేశారని గత ఎన్నికల్లో అన్నారు. మళ్లీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి.'' అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

  ప్రజల మధ్య చిచ్చుపెట్టి.. హైదరాబాద్‌ను దోచుకునేందుకే బీజేపీ నేతలు వస్తున్నారని ఆయన విమర్శించారు. వీళ్లకు హిందూ-ముస్లిం గొడవలు తప్ప.. అభివృద్ధి గురించి పట్టదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల సిద్దాంతాల వల్లే మన దేశం అభివృద్ధి చెందడం లేదని తెలిపారు. చివరకు తేజస్వి యాదవ్ లాంటి వారు కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని.. ఇంకో వెయ్యి జన్మలెత్తినా, కేసీఆర్ స్థాయికి రాలేరని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మీరే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించాలని విజ్ఞప్తి చేశారు.

  జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకున్న విషయం తెలిసిందే. తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. బీజేపీకి మద్దతు తెలిపింది. లక్ష్మణ్, కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్‌తో సమావేశం అనంతరం.. తమ అభ్యర్థులను ఉపసంహరించుకొని, గ్రేటర్ బరి నుంచి తప్పుకుంది. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలంతా బీజేపీకి మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. బీజేపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతే తిరుపతి ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే.. గ్రేటర్‌ బరి నుంచి పవన్ తప్పుకున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందున.. తిరుపతిలో జనసేనకు మద్దతు తెలపాలని పవన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

  కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ నువ్వా..నేనా.. అన్నట్లుగా తలపడుతున్న నేపథ్యంలో చతుర్ముఖ పోరు నెలకొంది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లడిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: