MAA Elections - Hema: సీనియర్ నటి హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ సంఘం..
నటి హేమ, నరేష్ (Naresh Hema)
MAA Elections - Hema: అనుకున్నదే జరిగింది. మొన్నటి నుంచి మళ్లీ మా అసోసియేషన్‌లో రచ్చ జరుగుతుంది. దానికి కేంద్రబిందువు అయిన హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది మా క్రమశిక్షణ సంఘం.
మా అసోషియేషన్‌లో మళ్లీ రచ్చ మొదలైంది. మొన్నటి వరకు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా కూడా హేమ తుఫాన్ రేపింది. టీ కప్పులో తుఫాన్ కాకుండా ఏకంగా తీరప్రాంతంలో వచ్చే తుఫాన్‌లాగే ఉందిది. ఎందుకంటే హేమ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్న మా అధ్యక్షుడు నరేష్.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈమెపై సీరియస్ అయ్యాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా సంపాదించుకపోగా.. ఉన్న డబ్బుల్లో 3 కోట్లు ఖర్చు చేసాడంటూ హేమ సభ్యులందరికీ వాయిస్ మెసేజ్ పంపింది. అందులోనే వెంటనే ఎన్నికలు రావాలని.. అవి రాకుండా నరేష్ ప్రయత్నిస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కరోనా కారణంగా వాయిదా పడుతున్న ఎన్నికలను తన కారణంగా ఆగిపోతున్నాయని హేమ చెప్పడం సవ్యంగా లేదని సీరియస్ అయ్యాడు నరేష్.
ఈమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పాడాయన. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఓ టీవీ ఛానెల్ డిబేట్‌కు వెళ్లింది హేమ. అక్కడ మా అసోషియేషన్ గురించి మాట్లాడింది. నరేష్‌తో పాటు మరికొందరిపై కూడా విమర్శలు చేసింది హేమ. దీన్ని ఇప్పుడు మా చాలా సీరియస్‌గా తీసుకుంది. మా సర్వసభ్య సమావేశం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరూ టీవీ ఛానెల్స్‌కు వెళ్లకూడదు.. అక్కడ మా గురించి మాట్లాడకూడదు.. కానీ హేమ వాటిని క్రాస్ చేసింది.
సీనియర్ నటి హేమ (Actress Hema)
దాంతో ఈమెకు షోకాస్ నోటీసు జారీ చేసారు మా క్రమశిక్షణ సంఘం. అంతేకాదు ఈమె సభ్యత్వంపై కూడా వేటు వేయాలని మా సంఘం ఆలోచిస్తుంది. దాంతో పాటు ఈమెను అధ్యక్ష పోటికి కూడా అనర్హురాలిగా ప్రకటించాలని చూస్తున్నారు. ఏదేమైనా కూడా చిలికి చిలికి గాలివానలా మారిపోతుంది మా వ్యవహారం. మొత్తానికి హేమకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం వెనక నరేష్ హస్తంతో పాటు చిరంజీవి సీరియస్ కావడం కూడా కీలకంగా కనిపిస్తుంది.