హోమ్ /వార్తలు /సినిమా /

K Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరు.. శోక సంద్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీ

K Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరు.. శోక సంద్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీ

కే.విశ్వనాథ్

కే.విశ్వనాథ్

Viswanath passes away: ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణ వార్త విని టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (K Viswanath passes away) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో కాసేపటి క్రితం ఆయన కన్నుమూశారు. విశ్వనాథ్ వయసు 92 ఏళ్లు. ఆయన  గత కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. గురువారం కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు విశ్వనాథ్.

తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ (RIP Viswanath).. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం సినిమా తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించింది. జాతీయ పురస్కారం గెలుచుకుంది. సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ఆయకు కీర్తి ప్రతిష్ఠతలు తెచ్చిపెట్టాయి. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం అందరినీ ఆలోజింపజేశాయి.

విశ్వనాథ్ పూర్తిపేరు.. కాశీనాథుని విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక.. వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. సినిమాల్లో ఆయన ప్రతిభను గుర్తించిన నాగేశ్వరరావు.. ఆత్మగౌరవం సినిమాలో దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత సిరిసిరి మువ్వ సినిమాతో దర్శకుడిగా ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అలా ఎన్నో అద్భుతమైన..అపురూపమమైన చిత్రాలను టాలీవుడ్‌కి అందించారు కె.విశ్వనాథ్.

K Viswanath Passed Away: శంకరాభరణం విడుదల రోజే.. శివైక్యం చెందిన విశ్వనాథ్.. ఆయన సినీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ తెలుగు సినీ అభిమానులను అలరించారు. అనేక సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి హిట్ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారు విశ్వనాథ్. సినిమారంగంలో చేసిన కృషికి గాను... 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు పద్మశ్రీ అవార్డును ఆయన అందుకున్నారు.

ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌  మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకువచ్చారని అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తీసకువచ్చాయని పేర్కొన్నారు.  విశ్వనాథ్‌ మహాభినిష్క్రమనం తెలుగు సినీరంగానికి గొప్ప లోటని సీఎం జగన్ అన్నారు.  విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

First published:

Tags: K viswanath, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు