మన దేశంలో తొలి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్న నటి విజయ శాంతి. ఒకవైపు అగ్ర హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆమె కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఒకానొక దశలో వేరే హీరోలతో నటించడం ఆపేసి పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. రాను రాను విజయ శాంతి చేసే సినిమాల్లోని పాత్రలు ఒకే మూసలో ఉండటంతో క్రమంగా ఈ లేడీ సూపర్ స్టార్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గింది. ఆ తర్వాత తన అడుగులను సినిమాల నుంచి రాజకీయాల వైపు వేసింది. ముందుగా బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న విజయ శాంతి.. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బీజేపీకి రాజీనామా చేసి ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించింది. ఆ తర్వాత తన పార్టీని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌లో విలీనం చేసింది. అంతేకాదు ఒకసారి మెదక్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైంది.
ఇక కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంతో 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. ఆ ఎన్నికల్లో విజయ శాంతి.. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా తెలంగాణ అభ్యర్ధుల తరుపున స్టార్ కంపెనర్‌గా వ్యవహరించింది. ఆర్నెల్ల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. దీంతో విజయ శాంతి .. తన అడుగులను మళ్లీ సినిమాలపై మళ్లించింది. గత కొన్నేళ్లుగా ఆమె ముఖానికి మేకప్ వేసుకుంటుందన్న ప్రచారం జరిగినా.. తాజాగా ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించడంతో ఈ విషయం కన్ఫామ్ అయింది.
ఇప్పటి వరకు కథానాయికగా వివిధ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించింది. ఇన్నేళ్లు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి..13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు హీరోయిన్‌గా విజయ శాంతి మొదటి సినిమా కృష్ణ హీరోగా విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ‘ఖిలాడీ కృష్ణుడు’కావడం గమనార్హం. అంతేకాదు గతంలో కృష్ణ , మహేష్ బాబు నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో వీళ్లిద్దరితో కలిసి నటించింది. ఇపుడు మరోసారి మహేష్ బాబు సినిమాతో నటిగా విజయ శాంతి సెకండ్ మొదలుపెట్టడం విశేషం. ఈసినిమాలో విజయశాంతి..మహేష్ బాబుకు అమ్మలా నటిస్తుందో లేకపోతే అత్తలా మురిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: #MaheshBabu26, Anil Ravipudi, Bjp, Krishna, Lok sabha election results, Mahesh babu, Mahesh Babu Latest News, Rashmika mandanna, Telangana Lok Sabha Elections 2019, Telugu Cinema, Tollywood, Trs, TS Congress, Vijaya Nirmala, Vijayashanti