SP Balasubrahmanyam Passes Away | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆయన మృతిపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు బాలు మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు విషయానికొస్తే.. బాలు మరణం తెలుగు ప్రేక్షకులకు తీరని లోటు అని చెప్పాలి. ఈయన మృతిపై ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,విజయశాంతి, నిర్మాతలు అశ్వనీదత్, రామోజీ రావు, దర్శకులు రాజమౌళి, రాఘవేంద్రరావు, కే.విశ్వనాథ్, శ్రీను వైట్ల సహా పలువురు సినీ ప్రముఖులు బాలు మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. మరోవైపు బాలు మరణంపై టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేయడమే కాదు... ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మరణం లేని స్వరం, మీ పాట అజరామరాం. మీరు నాకు పాడిన పాటలు, నాకు మీరిచ్చిన వరాలు. మీరు లేకున్నా మీ పాటగా నాతోనే ఉంటారు, దేశ సంగీత ప్రియుల గుండెల్లో సంతకంగా మిగిలిపోతారు. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ తన సందేశాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. బాలకృష్ణ, బాలసుబ్రహ్మణ్యంతో కలిసి తన ఓన్ బ్యానర్‌లో‘గొప్పింటి అల్లుడు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా.
గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ ఈ రోజు మధ్యాహ్నం 01గం.04 నిమిషాలకు తుది శ్వాస విడిశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గత 52 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. మధ్యలో ఆయన కోలుకున్నట్టు వార్తలు వచ్చినా.. పైనున్న ఆ దేవుడికి ఆ గాన గంధుర్వుడి గాన మాధుర్యం వినిలానిపించిందేమో.. ఆయన దగ్గరకు పిలిపించుకున్నారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. అంతేకాదు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు ఎస్పీ బాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.