హోమ్ /వార్తలు /సినిమా /

Dasari Birth Anniversary: దర్శకరత్న దాసరి నారాయణ రావు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ’సరిలేరు నీకెవ్వరు’..

Dasari Birth Anniversary: దర్శకరత్న దాసరి నారాయణ రావు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ’సరిలేరు నీకెవ్వరు’..

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరిచిపోలేని పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు. ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఎంతోమంది గుండెల్లో మాత్రం అలాగే ఉండిపోయారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు దాసరి.

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరిచిపోలేని పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు. ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఎంతోమంది గుండెల్లో మాత్రం అలాగే ఉండిపోయారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు దాసరి.

Dasari Birth Anniversary: దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలల నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. నేడు దాసరి నారాయణ రావు జయంతి.

ఇంకా చదవండి ...

Dasari Birth Anniversary: దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలలో నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. అంతే కాదు మేస్త్రీగా రాజకీయాల్లోకెళ్లి ఇస్త్రీ చేసిన దర్శక నట దిగ్గజం దాసరి నారాయణ రావు. దాసరి అనేది పేరు కాదు...ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. తెలుగు ఇండస్ట్రీల ఎంతో మంది చేత గురువు అని పిలిపించుకున్న లెజెండ్. నేడు ఈ దర్శకరత్న జయంతి. ఈ సందర్భంగా ఈయన సినీ ప్రస్థానాన్ని ఓ సారి స్మరించుకుందాం.

మోడ్రన్ తెలుగు సినిమాను దాసరి నారాయణ రావును వేరు చేసి చూడలేం. ఎన్నో అద్భుతమైన పాత్రలు. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు. అవార్డులు రివార్డులు. ఆయన హ్యాండేస్తే స్టార్లు సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన పాత్ర చిత్రణ చేపడితే.. బొబ్బిలిపులిలా గాండ్రిస్తుంది. ‘తాతా మనవడు’ సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం ...అదే తాతా మనవడు నేపథ్యంల తెరకెక్కిన ‘ఎర్రబస్సు’ ముగియడం విషాదకరం.

మే 4న దర్శకుల దినోత్సవం (Twitter/Photo)

40ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం, 151 చిత్రాలకు దర్శకత్వం, 54 సినిమాల నిర్మాణం..

250 చిత్రాలకు సంభాషణలు..దాసరినారాయణరావుకు చెందిన కొన్నంటే కొన్ని లెక్కలు. అంతే కాదు నటుడిగా...జర్నలిస్టుగా...పబ్లిషర్ గా...మ్యాగజైన్ ఎడిటర్ గా...డిస్ట్రిబ్యూటర్ గా... రాజకీయవేత్తగా, కేంద్ర మంత్రిగా అనేక రంగాల్లో రాణించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు దాసరి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుల నుంచి నటన రాబట్టుకోవడమే కాదు.. స్వయంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

దాసరి నారాయణరావు: తెలుగు ఇండస్ట్రీకి గురువు

తెలుగు చిత్రసీమకు ఎన్నో మరుపురాని చిత్రాలందించిన 4 మే 1942 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుల జన్మించారు. కాలేజీ రోజులల్ల నాటకాలు వేయడమే కాకుండా కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించేవారు. 1966లో దాసరి వేసిన నాటకాన్ని చూసిన ప్రముఖ నిర్మాత వై.వి.కృష్ణయ్య ఆయనలున్న టాలెంట్ చూసి నటుడిగా సినిమా అవకాశం ఇచ్చారు.  ఆ తర్వాత కె.రాఘవ నిర్మించిన ‘తాతా మనవడు’తో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకున్న ఈ దర్శక దిగ్గజం....ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

’తాత మనవుడు’ (Youtube/Credit)

ఒక్కో హీరోతో ఒక్కో అద్భుతం. ఎన్టీఆర్ తో బొబ్బులిపులి, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం వంటి భారీ హిట్లిచ్చిండు. అసలు బొబ్బులి పులైతే రికార్డ్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది.  ఈ మూవీలతో దాసరి నటులను కాదు రాజకీయ నాయకులను కూడా తయారు చేయగలరన్న పేరు తెచ్చుకున్నరు. దాసరి డైరెక్ట్ చేసిన బొబ్బులి పులి, సర్ధార్ పాపారాయడు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి బూస్ట్ లా పనిచేసినయి.

ఎన్టీఆర్‌తో ’బొబ్బలి పులి’(File/Photo)

ఏఎన్ఆర్ తో అయితే మరపురాని చిత్రాలు. ప్రేమాభిషేకం, మేఘసందేశం, బహుదూరపు బాటసారి ఆయన దర్శకత్వంలో వచ్చి ప్రేక్షకుల మనసులకు హత్తుకున్నాయి. ముఖ్యంగా ప్రేమాభిషేకం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీల మరో దేవదాసుగా నిలిచి సంచలనం సృష్టించింది. హీరోగా పనైపోయిందనుకున్న ఏఎన్ఆర్ ఇమేజ్ ను ‘ప్రేమాభిషేకం’ సినిమాతో నిలబెట్టిన ఘనత దాసరిది. అంతగా  నటులకు స్టార్ డమ్ తెచ్చి పెట్టిన దర్శకుడిగా పేరు సాధించారు.

ఏఎన్నార్ ‘ప్రేమాభిషేకం’(Twitter/Photo)

మోహన్ బాబుకైతే జన్మనిచ్చిన తండ్రి నారాయణ స్వామి అయితే,  స్టార్ నటుడిగా తెరమీద జన్మనిచ్చింది మాత్రం దాసరి నారాయణరావనే చెప్పాలి. ప్రేమాభిషేకం, సర్ధార్ పాపారాయుడు, తాండ్రపాపారాయుడు వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలిచ్చి మోహన్ బాబును ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత దాసరిది. ‘స్వర్గం నరకం’తో మొదలైన వీరి ప్రయాణం ఎన్నో చిత్రాల వరకూ సాగింది.

’పాలు నీళ్లు’ సినిమాలో దాసరి, మోహన్ బాబు (File/Photo)

అటు మోహన్ బాబునే కాదు...మురళీ మోహన్, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి నుంచి మొదలు పెడితే...నర్సింహారాజు...శ్రీహరి, రమేష్ బాబు, మహేశ్ బాబు సహా ఎంతో మంది హీరోలను వెండితెరకు పరిచయం చేసిన ఘనత దాసరిది.అటు హీరోయిన్ల విషయానికొస్తే..జయసుధ, జయప్రద, మాధవి, శ్రీదేవి, సుజాత, సిల్క్ స్మిత, రజినీ, అన్నపూర్ణ, ఫటాపట్ జయలక్ష్మీ సహా ఎంతో తారమణులను స్టార్ డమ్ తీసుకొచ్చిన  ఘనత కూడా ఈయనదే.

దాసరి గురించి ఇంకా చెప్పాలంటే ...అసలు ఒక కథను సినిమాగా తీయడంలో.. ఆ కథనాన్ని రక్తి కట్టించడంలో.. డైలాగులు పండించడంలో.. ఆయనకు ఆయనే సాటి. ఆయన ఏ చిత్రం తీసుకున్నా అది నిజ జీవితానికి దగ్గరే వుంటది. చిల్లరకొట్టు చిట్టెమ్మ దగ్గర నుంచి ఆదిదంపతులు, అమ్మరాజీనామా, కంటే కూతర్నే కనాలి వంటి సినిమాలు దాసరి దర్శక ప్రతిభను లోకానికి చాటినయి.  అసలు దాసరి సినిమాకు ప్రత్యేకించి హీరో అవసరం లేదన్న పేరు సంపాదించుకున్నారు.  అటు సోగ్గాడు శోభన్ బాబు బలిపీఠం, గోరింటాకు, స్వయంవరంవంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా గాలి వానలో పాట ఇప్పటికీ ప్రేక్షకులు మరవలేదు.

‘స్యయంవరం’లో శోభన్ బాబు, జయప్రద (Twitter/Photo)

అటు కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, తాండ్రపాపారాయుడు, తిరుగుబాబు,రంగూన్ రౌడీ,  సీతారాములు వంటి చిత్రాలతో కృష్ణంరాజును మాములు స్టార్ నుంచి రెబల్ స్టార్ గా తీర్చిదిద్దిన ఘనత దాసరికే దక్కుతుంది. తిరుగులేని ఇమేజ్ ను సంపాదించిన పెట్టారు. అటు కృష్ణతో యుద్దం, ఊరంతా సంక్రాంతి, ప్రజానిధి, విశ్వనాథ నాయకుడు వంటి ఎన్నో హిట్ సినిమాలను అందించని ఘనత దాసరిది.

‘విశ్వనాథ నాయకుడు’లో కృష్ణ,కృష్ణంరాజు, శివాజీ గణేషన్’ (Twitter/Photo)

ఇక తర్వాత తరం నటులెందరికో తనదైన దర్శక ప్రతిభతో బిగ్గెస్ట్ హిట్లిచ్చారు దాసరి. వెంకటేష్ కు బ్రహ్మపుత్రుడు, నాగార్జునకు మజ్నూ చిత్రాలిచ్చిన మైలేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇది తొలిరాత్రి అంటూ దాసరి రాసిన పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అటు చిరంజీవితో తన వందో చిత్రం లంకేశ్వరుడు తీసారు దాసరి.

Dasari Jayanthi, Dasari Jayanthi celebrations,dasari narayana rao,dasari narayana rao films, dasari narayana rao movies, dasari narayana rao news, tollywood,దాసరి, చిరంజీవి
దాసరితో చిరంజీవి Photo : Twitter

అలాగే టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణతో తన 150 చిత్రం పరమవీరచక్ర తీయడం విశేషం. అటు విజయశాంతితో తీసిన ఒసేయ్ రాములమ్మ సిన్మా గురించి ఎంత చెప్పినా తక్కువే. దాసరి కెరీర్లనే కాదు విజయశాంతి కెరీర్లనే ఈ మూవీ మైలురాయిగా నిలిచింది.

దాసరి, బాలయ్య (file/Photo)

అప్పటి వరకు సినిమా పరిశ్రమ అంటే అందాల లోకం.. అనే భ్రమ పడే వారి కోసం శివరంజని, అద్దాలమేడ తీసి పెద్ద సాహసం చేశాడు దాసరినారాయణరావు. మూవీ ఇండస్ట్రీలో ఉండే లోటుపాట్లను చీకటి కోణాలను నటీనటులు పడే సంఘర్షణను అద్భుతంగా తెరకెక్కించారు. అంతకాదు సినీ నటుల జీవితాలు వడ్డించిన విస్తరి కాదని ఈ సినిమాల ద్వారా చూపించారు.

దాసరి నారాయణ రావు (File/Photo)

దాసరిలో అద్భుత నటుడున్నారు. స్వర్గం నరకం చిత్రంతో మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు దర్శకరత్న. రంగస్థల అనుభవం ఉండటంతో నటుడిగా కూడా తన జోరు ప్రదర్శించారు. మామగారు, మేస్త్రీ వంటి చిత్రాల్లో నటనకు గాను బెస్ట్ యాక్టర్ గా పలు అవార్దులు సైతం అందుకున్నారు. 

ఎన్టీఆర్,రజినీకాంత్, మోహన్ బాబు, రాఘవేంద్రరావులతో దాసరి నారాయణ రావు (Twitter/Photo)

ఒకవైపు మాటల రచయితగా, దర్శకుడిగా బిజీగా ఉన్న దర్శకరత్న పాటల రచయితగా కూడా రాణించారు దాసరి. పాటల రచనతో తన కలానికి రెండు వైపులా పదును అని నిరూపించుకున్నారు. ఆత్రేయ, వేటూరి, సినారే వంటి మేటి పాటల రచయితలతో సమానంగా అద్భుతమైన సాహిత్యాన్నందించారు దాసరి.

దాసరి నారాయణ రావు (Twitter/Photo)

కోడిరామకృష్ణ, రవిరాజ పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కె.మురళీమోహన్ రావు, సురేష్ కృష్ణ, కే.యస్.రవికుమార్ టాంటి సుప్రసిద్ధ దర్శకులు దాసరి శిష్యరికంలోనే పెద్ద దర్శకులు అయ్యారు.

దాసరి నారాయణ రావు శిష్యుడు (Twitter/Photo)

ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించిన దాసరిని వరించిన అవార్డులకు లెక్కేలేదు. మేఘసందేశం, కంటే కూతుర్నే కను సినిమాలకు గాను జాతీయ అవార్డులు అందుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటుడిగా రెండు నంది అవార్డులు,. 1990లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, 2007లో ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర పురస్కారం...వీటితోపాటు ఉత్తమ దర్శకుడిగా, మాటల,పాటల రచయితగా అనేక అవార్డులు దాసరి కీర్తికీరిటంలో వున్నాయి. మే 4 న జన్మించిన అదే నెల 30వ తేదిన ఆయన కన్నుమూయడం విషాదకరం. దాసరి మన నుంచి భౌతికంగా దూరమైన ఆయన సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఒక మేస్త్రీగా ఎప్పటికీ  కొలువై ఉన్నారు.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Dasari Narayana Rao, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు