దేశవ్యాప్తంగా ఇప్పుడు దిశ తప్ప మరేం వినిపించడం లేదు. ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. అయితే ఇప్పుడు దీనిపై సినిమా వాళ్ల కన్ను కూడా పడుతుందని తెలుస్తుంది. ఏదో ఓ సినిమాలో దిశ ఎపిసోడ్ మొత్తాన్ని ఇతివృత్తంగా వాడుకోవాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈ ఎపిసోడ్ గురించి ఆరా తీస్తున్నారు. ఎమోషనల్‌గా దేశం మొత్తాన్ని కదిలించిన సీన్ కావడంతో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి సినిమాలో ఉంటే అదిరిపోతుందని ప్రతీ దర్శక నిర్మాత కూడా భావిస్తున్నాడు. అందుకే తమ సినిమాల్లో దిశ ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ముందుగా ఈ సీన్ బాలయ్య సినిమాలో కనిపించబోతుందని ప్రచారం మొదలైంది. బోయపాటితో ఈయన త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. దీని ఓపెనింగ్ ఈ మధ్యే జరిగింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికితోడు దిశ ఎపిసోడ్‌పై చిత్ర ఓపెనింగ్‌లో చాలా సీరియస్‌గా స్పందించాడు బాలయ్య. దాంతో ఈ చిత్రంలో బోయపాటి కూడా ఇలాంటి ఓ ఎపిసోడ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. సింహా సినిమా సమయంలో యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన ఎపిసోడ్ పెట్టాడు బోయపాటి శ్రీను. ఇక లెజెండ్‌లో అమ్మాయిలను పురిటిలోనే చంపే వారికి బుద్ధి చెప్పే సీన్ కూడా పెట్టాడు. ఇప్పుడు కూడా దిశ ఎపిసోడ్ ఒకటి ఈ చిత్రంలో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్య ఒక్కడే కాదు.. మిగిలిన హీరోలకు కూడా దిశ ఎపిసోడ్ బాగానే కదిలించింది. దాంతో తమ సినిమాల్లో కూడా అలాంటి ఎపిసోడ్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. నాగార్జున కూడా తన తర్వాతి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. సోలోమెన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో దిశ ఎపిసోడ్ ఉండే అవకాశం లేకపోలేదు. వీళ్లే కాదు.. చాలా మంది దర్శక నిర్మాతల కన్ను దిశ ఎపిసోడ్‌పై ఉంది. అయితే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అనగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. అందులో దిశ ఎపిసోడ్ పడితే ఇంకేమైనా ఉందా..? మొత్తానికి మరి చూడాలిక.. దిశ ఎపిసోడ్‌ను ముందుగా ఏ సినిమాలో ఎవరు పెట్టబోతున్నారో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP disha act, Disha murder case, Telugu Cinema, Tollywood