కొందరు హీరోయిన్లు మారరు అంతే.. మారినట్లు కనిపిస్తుంటారు. వాళ్లు తెలుగులోనే సినిమాలు చేస్తుంటారు కానీ వాళ్ల మనసు మాత్రం బాలీవుడ్‌పైనే ఉంటుంది. ఇక్కడ అవకాశాలు ఇచ్చినా కూడా అక్కడికి వెళ్లిన తర్వాత అన్నం పెట్టిన ఇండస్ట్రీపైనే అవాకులు చెవాకులు పేలుతుంటారు. కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటారు. గతంలో తాప్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. రాఘవేంద్రరావుకి బొడ్డుపై కొట్టడం ఏం పిచ్చో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత మరికొందరు హీరోయిన్లు కూడా ఇక్కడి నుంచి బాలీవుడ్ వెళ్లి యిష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇదే చేసింది. ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ పీఠం కోసం పోటీ పడుతుంది పూజా. ఇప్పటికే స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈమె.. ప్రస్తుతం ప్రభాస్‌తో రాధే శ్యామ్.. అఖిల్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత తెలుగులో అవకాశాలు వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదు. దానికి కారణం కూడా అర్థమవుతుంది.
ఎందుకంటే బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తుండటంతో సౌత్ ఇండస్ట్రీని పూర్తిగా పక్కనబెట్టేసింది పూజా. అంతేకాదు ఇప్పుడు దక్షిణాది సినిమాలపై.. ఇక్కడి ఆడియన్స్‌పై కొన్ని కామెంట్స్ చేసింది. సౌత్ ఇండియన్ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నవ్వుతూ నవ్వుతూనే అనాల్సిన మాటలన్నీ అనేసింది పూజా. ఎందుకో తెలియదు దక్షిణాది ఇండస్ట్రీలో అందరి కళ్లు నడుముపైనే ఉంటాయని.. వాళ్లంతా అదే మత్తులో ఉంటారని నవ్వుతూనే చెప్పింది. సిల్లీగా చెప్పిందో.. సీరియస్‌గా చెప్పిందో తెలియదు కానీ పూజా మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
ఇక్కడి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు ఇదే సినిమాను టార్గెట్ చేస్తావా అంటూ పూజాపై కామెంట్స్ మొదలయ్యాయి. అంతలా నడుము మత్తులో ఉన్నపుడు చూపించకుండా ఉండాల్సింది కదా అంటూ రివర్స్ కౌంటర్స్ కూడా పడుతున్నాయి. చూపించేది బాగానే ఉంటుంది.. పారితోషికం కూడా బాగానే తీసుకుంటారు.. మళ్లీ పై నుంచి పేరు తెచ్చిన ఇండస్ట్రీపైనే నోరు పారేసుకుంటారు.. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ యిష్టం లేకుండా అయితే నటించలేదు కదా.. అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వచ్చింది.. బాలీవుడ్‌లో ఆఫర్స్ వస్తున్నందుకా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా కూడా పూజా హెగ్డే కామెంట్స్ మాత్రం వైరల్ కాంట్రవర్సీకి కారణమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Telugu Cinema, Tollywood