టాలీవుడ్ నటి తమన్నా కొన్ని రోజులు షూటింగ్‌లకు కొంత విరామం ఇచ్చి రాజస్థాన్‌లో తన ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేస్తోంది. తమన్నా తన స్నేహితురాలు హన్నా ఖాన్ పెళ్లి వేడుక కోసం రీసెంట్గా రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్ళింది. అక్కడే హన్నా ఖాన్ మెహందీ, సంగీత్ వేడుకలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది. అసలే హీరోయిన్.. దీంతో పెళ్ళి కుమార్తెకు పోటీగా మిల్కీ బ్యూటీ రెడీ అయ్యి హంగామా చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఆమె మాచో స్టార్ గోపీచంద్ సరసన సీటీమార్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించనుంది. ఇక ఈ సినిమాతో పాటు తమన్నా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటించనుంది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సరసన హీరోయిన్గా నభా నటేష్ చేస్తోంది.
తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న 'లెవెంత్ అవర్' అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ అల్లు అరవింద్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తోంది. కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.
ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో కూడా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఆమె నటించిన దటీజ్ మహాలక్ష్మి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా కంగనా రనౌత్ హిందీ సూపర్ హిట్ క్విన్‌కు రీమేక్ వస్తోంది. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు.