మెగా హీరోలకు ఇండస్ట్రీలో కాస్త ఎక్కువ గుర్తింపు ఉంటుంది. అక్కడ్నుంచి వచ్చిన హీరోలు కాస్త క్రేజ్ తెచ్చుకున్నా కూడా మార్కెట్ త్వరగానే పెరిగిపోతుంది. అలా ఈ ఏడాది మెగా కుటుంబం నుంచి హీరోగా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) వచ్చాడు. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రం 50 కోట్ల షేర్ వసూలు చేసి మనోడిని ఫస్ట్ సినిమాతోనే స్టార్‌గా మార్చేసింది. ఇప్పుడు ఈయన నటించిన రెండో సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అదే కొండ పొలం. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కొండ పొలం (Kondapolam) ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు అంతే. మధ్యలో ఓటిటిలో విడుదల చేయాలని సన్నాహాలు చేసారు కానీ ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉండటంతో మనసు మార్చుకుంది చిత్ర బృందం. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా నల్లమల అడవులను జల్లడ పట్టి అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు క్రిష్. అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. ఇక ఈ నవల కొండపొలం (Kondapolam) విషయానికి వస్తే.. నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది.
ఇక ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. వికారాబాద్ అడవుల్లోనే ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. జాబ్ కోసం వెళ్తే గొర్రెలు కాచుకునే వాడి కొడుకువి నీకెందుకు జాబ్ అన్నట్లు హీరోను అవమానించేది కొండ పొలం ట్రైలర్లో బాగా హైలైట్ చేసాడు క్రిష్. కచ్చితంగా ఈ సినిమాతో వైష్ణవ్ మరో విజయం అందుకుంటానని ధీమాగా చెప్తున్నాడు. ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kondapolam, Telugu Cinema, Tollywood, Vaishnav tej