మా ఎన్నికలు ఈ సారి జరిగినంత రసాభాసగా ఎప్పుడూ జరగలేదని స్వయంగా చిరంజీవి సైతం ఒప్పుకున్నాడు. పరిస్థితులు అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవని.. వాటికి తగ్గట్లుగా మనం మారడం తప్ప మరో ఆప్షన్ కూడా లేదని చెప్పాడు మెగాస్టార్. ఆయనే చెప్పిన తర్వాత మా ఎలక్షన్స్ (MAA elections) గురించి ఎవరు మాత్రం ఏం మాట్లాడతారు. ఇదే జరుగుతుందని సర్దుకుపోవడం తప్ప. అంత తిట్టుకున్న వాళ్లు.. మళ్లీ పోలింగ్ రోజు ఉదయమే కౌగిలించుకోవడం అసలు విచిత్రం. ముఖ్యంగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ వచ్చి ఒకరినొకరు కౌగిలించుకోవడం.. నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసిన తర్వాత సినిమా వాళ్లంటే ఇంతే కాబోలు అంటూ జనాలు కూడా నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉంటే లోపల జరుగుతున్న సీన్‌కు.. బయట జరిగే సీన్‌కు అస్సలు పొంతన లేదు. లోపల నవ్వుకుంటుంటే.. బయట కొట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే కొరుక్కుంటున్నారు.
పోలింగ్ రోజు ఉదయం ఒకానొక సమయంలో నటుడు శివ బాలాజీని నటి హేమ కొరికిన వీడియో వైరల్ అయిపోతుంది. ఎంతగా అంటే దానిపై కొంచెం కొంచెం కొరుక్కుతినవయ్యా అంటూ రీమిక్సులు వేసుకునేంత. అసలు కొరకడం ఏంట్రా బాబూ అంటూ కొందరు హేమ ఫోటోలు, వీడియోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఆమె కొరికిన తర్వాత శివ బాలాజీ చేతికి గాయం కూడా అయింది. అందుకే శివ బాలాజీ వెంటనే నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో చేరిపోయాడు. అక్కడ అయిన గాయానికి చికిత్స తీసుకున్నాడు. ఫస్ట్ ఎయిడ్ కోసం ఆస్పత్రికి వచ్చానని మీడియాతో శివబాలాజీ తెలిపాడు. హ్యూమన్ బైట్ కదా అని టీటీ ఇంజెక్షన్ వేయించుకోవడం మంచిదని చెప్పాడు ఈయన.
డాక్టర్లు తనకు యాంటిబయోటిక్స్ ఇచ్చి.. కట్టు కూడా కట్టారని క్లారిటీ ఇచ్చాడు. హేమ ఎందుకు చేయి కొరికిందో తనకు అర్థం కాలేదన్నాడు శివ బాలాజీ. మరోవైపు హేమ మాత్రం మరోలా చెప్తుంది. తానేం కొరకలేదని ముందుగా బుకాయించినా కూడా ఆ తర్వాత వీడియో బయటికి రావడంతో అసలు నిజం ఒప్పుకుంది. తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని.. ఎంతసేపటికీ తీయకపోవడంతో చేయి కొరకాల్సి వచ్చిందని చెప్పింది. దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదని హేమ స్పష్టం చేసింది. అది అనుకోకుండా జరిగిందని చెప్పుకొచ్చింది హేమ. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి హేమ పోటీ చేస్తుంటే.. విష్ణు ప్యానెల్ నుంచి శివ బాలాజీ పోటీ చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress hema, MAA Elections, Telugu Cinema, Tollywood