రాజేంద్ర ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న ఇమేజ్ గురించి.. ఈ పేరుకు ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు తెలుగులో కమెడియన్లు అని సపరేట్‌గా ఉండేవాళ్లు. కానీ రాజేంద్రప్రసాద్ వచ్చిన తర్వాత కామెడీ హీరోలు వచ్చారు. సినిమాలో ఎక్కడో ఓ చోట కామెడీ కాకుండా సినిమా అంతా కామెడీతోనే నడిపించడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని ఎన్నో సినిమాల్లో చేసి చూపించాడు రాజేంద్ర ప్రసాద్. అందుకే ఆయన నట కిరీటి అయ్యాడు. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే బిజీగా ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. మొన్న క్లైమాక్స్ సినిమాతో వచ్చాడు. ఇప్పుడు గాలి సంపత్ అంటూ వచ్చేస్తున్నాడు. ఈయనపైనే ఓ సినిమా కథ రాసి నిర్మాతగా ఉండి.. స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి. మార్చ్ 11న శివరాత్రి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్‌లో రాజేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తన జీవితంలో పడిన కష్టాల గురించి ఓపెన్ అయ్యాడు. అవన్నీ విన్న తర్వాత స్క్రీన్ పై అంత నవ్వించే రాజేంద్రుడి జీవితంలో ఇన్ని విషాదాలు ఉన్నాయా అనుకోక తప్పదు. నమ్మిన వాళ్లే తనను దారుణంగా మోసం చేసారని.. రోడ్డున పడేసారని వాపోయాడు ఈయన. 70ల్లో తన ఇంజనీరింగ్ పూర్తవగానే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిపోయాడు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత గోల్డ్ మెడల్‌తో అక్కడ్నుంచి బయటకు వచ్చాడు.
ఎన్టీఆర్ స్పూర్తితో సినిమాల్లోకి వచ్చాడు. అది కూడా అనుకోకుండానే ఆయనకు అవకాశాలు వచ్చాయి. పెద్దగా కష్టపడకుండానే ముందుగా సినిమాల్లోకి వచ్చేసాడు రాజేంద్రప్రసాద్. వచ్చిన తర్వాత నిలబడటానికి మాత్రం చాలా కష్టపడ్డాడు. ఆయన వచ్చే సమయానికి ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అప్పట్లో ప్రేక్షకులు కొత్త హీరోను ఆదరించాలంటే ఆయనలో ఆకర్షించే గుణం ఏదో ఒకటి ఉండాలి.
అందుకే తను చార్లీ చాప్లిన్ రూట్ ఎంచుకున్నానని చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. అలా కామెడీ సినిమాలు చేసుకుంటూపోయానని.. కానీ ఒకానొక సమయంలో తనను సొంత వాళ్లే ఆర్థికంగా మోసం చేసారని చెప్పాడు. అప్పటి వరకు సంపాదించిందంతా ఊడ్చుకుపోయారని.. నమ్మిన వాళ్లే ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదని చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. ఏదేమైనా కూడా ఆ జ్ఞాపకాలు మాత్రం మరిచిపోలేనివి అంటున్నాడు నట కిరీటి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajendra Prasad, Telugu Cinema, Tollywood