సోషల్ మీడియా యుగంలో లోకల్ ట్యాలెంట్‌కు మంచి గుర్తింపు లభిస్తుంది. ట్యాలెంట్ ఉంటే చాలు...వారికి బ్రహ్మరథం పట్టేందుకు నెటిజన్స్ సిద్ధంగా ఉంటున్నారు. అలా తెలుగునాట సెలబ్రిటీ స్టేటస్ పొందిన వ్యక్తి దుర్గా రావు. ఈయన పేరు అలా చెప్తే అర్థం కాదు.. టిక్ టాక్ దుర్గా రావు అంటూ ఆడియన్స్‌కు ఇట్టే అర్థమైపోతుంది. టిక్ టాక్‌ను ఈయన వాడుకున్నంత బాగా ఎవరూ వాడుకోలేదంటే అతిశయోక్తి కాదు. 2020 అందరికీ కరోనాతో పిచ్చెక్కిస్తే.. దుర్గా రావు మాత్రం టిక్ టాక్ వీడియోలతో పిచ్చెక్కించాడు. ఈయన తన భార్యతో కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలు సంచలనం రేపాయి. ముఖ్యంగా నాదీ నక్కిలీసు గొలుసు పాట అయితే సంచలనమే. మన స్టార్ హీరోలు కూడా దుర్గా రావు చేసిన స్టెప్పులు చేసారంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే తన గుర్తింపుతో సినిమాల్లోకి కూడా వచ్చేస్తున్నాడు ఈయన. మొన్నటికి మొన్న జబర్దస్త్.. ఆ తర్వాత ఢీ షోలలో తన సత్తా చూపించిన ఈయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ మధ్యే జగపతిబాబుతో కలిసి స్టేజీపై డాన్సులు కుమ్మేసాడు దుర్గా రావు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా స్టార్ మరో అడుగు ముందుకేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే బిగ్ బాస్.. అవును సోషల్ మీడియాలో సంచలనాలు రేపుతున్న ఈయన్ని బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు కూడా ఆయన్ని అడిగారు కూడా. మనోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. పైగా వాళ్లకు కావాల్సింది కూడా అదే. దుర్గా రావు అంటూ తెలియని సాఫ్ట్ కార్నర్ కూడా చాలా మందిలో ఉంది.
పైగా మంచి ఎంటర్టైనర్ కూడా. అందుకే దుర్గా రావును బిగ్ బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్‌గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం ఆయన్ని అడిగితే నిజమే అని చెప్పాడు కూడా. తనను అడిగారని.. పిలిస్తే వెళ్తానని చెప్పుకొచ్చాడు దుర్గా రావు. టిక్ టాక్ నుంచి మొదలైన దుర్గా రావు ప్రయాణం ఇప్పుడు సినిమాల వరకు వచ్చింది. ఇప్పటికే క్రాక్‌లోనూ మెరిసాడు దుర్గా రావు. ఇక జగపతిబాబు సినిమాలో కూడా కనిపించాడు.
ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వస్తే మనోడి క్రేజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. జూన్ నుంచి బిగ్ బాస్ 5 తెలుగు మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈయన కంటే ముందు యూ ట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్‌ను కూడా బిగ్ బాస్‌లోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ సారి ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న వాళ్లపైనే నిర్వాహకులు దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Telugu Cinema, Tik Tok Star Durga Rao, Tollywood