ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు హీరోల పరిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్కడ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో అల్లరి నరేష్. 2012లో విడుదలైన ‘సుడిగాడు’ తర్వాత ఇప్పటివరకు ఒక్క విజయం కూడా రాలేదు ఈ హీరోకు.
ఎన్ని సినిమాలు చేసినా కూడా అల్లరి నరేష్‌కు విజయం వరించడం లేదు. ఆయన తర్వాత సాయి ధరమ్ తేజ్‌కు కూడా ఇదే పరిస్థితి. ఈయన కూడా రేసులో బాగా వెనకబడిపోయాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస విజయాలు అందుకున్న మెగా మేనల్లుడు.. ఇప్పుడు మాత్రం పోటీ పడి మరీ ఫ్లాపులు ఇస్తున్నాడు. 2015లో వచ్చిన ‘సుప్రీమ్’ తర్వాత ఈయన నటించిన ఆరు సినిమాలు డిజాస్టర్‌లే. ఇప్పుడు ఈయన ఆశలన్నీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న ‘చిత్రలహరి’ సినిమాపైనే. ఎప్రిల్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.
కళ్యాణ్ రామ్‌కు మూడేళ్లుగా ఒక్క విజయం కూడా లేదు. 2015లో వచ్చిన ‘పటాస్’ తర్వాత అన్నీ ఫ్లాపులే ఈ నందమూరి హీరోకు. గతేడాది వచ్చిన ‘యిజం’.. గతేడాది వచ్చిన ‘నా నువ్వే’, ‘ఎమ్మెల్యే’ సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. ఈ మధ్యే వచ్చిన ‘118’ కూడా పర్లేదనిపించింది కానీ సూపర్ హిట్ కాదు. ఇక నితిన్‌కు కూడా ఫ్లాపుల బెడద తప్పడం లేదు. వరస విజయాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా.. ఆ తర్వాత మరోసారి తడబడుతున్నాడు ఈ హీరో. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అ ఆ’.. సినిమా తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చాడు నితిన్.
‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ నితిన్ ఆశలు నిలబెట్టలేకపోయాయి. దాంతో ఇప్పుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ యేలేటి, రమేష్ వర్మలతో సినిమాలు చేస్తున్నాడు నితిన్. రాజ్ తరుణ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా తర్వాత ఇప్పటివరకు మరో హిట్ లేదు ఈ కుర్రాడికి. అఖిల్‌కు కూడా ఇప్పుడు విజయం కీలకం. ఈయన నటించిన రెండు సినిమాలు ‘అఖిల్’, ‘హలో’ ఫ్లాప్. మొన్న ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో నెక్ట్స్ సినిమాతో అయినా విజయం అందుకోవాలని ఆరాటపడుతున్నాడు అక్కినేని వారసుడు.
మంచు సోదరులు మనోజ్, విష్ణు ఏకంగా సినిమాలు చేయడమే మానేశారు. వాళ్లే సినిమాలు చేసిన ఫ్లాప్ అనే మాట తప్ప ఇంకోటి వినిపించడం లేదు. మనోజ్ అయితే ఈ ఫ్రస్టేషన్‌లో తాను ఇండస్ట్రీకి దూరమవుతున్నట్లు ట్వీట్ కూడా చేశాడు. యాక్షన్ హీరో గోపీచంద్‌ను కూడా వరస పరాజయాలు ఇబ్బంది పెడుతున్నాయి. 2014 లో వచ్చిన ‘లౌక్యం’ సినిమా తర్వాత ఈయనకు ఒక్క విజయం కూడా రాలేదు. ఈ మధ్యే తమిళ దర్శకుడు తిరుతో సినిమాకు కమిట్ అయ్యాడు గోపీచంద్. ఈ సినిమా కథ ఇండో పాక్ నేపథ్యంలో సాగుతుంది.
నాగచైతన్య సైతం ఒక్క విజయం ప్లీజ్ అంటున్నాడు. గతేడాది చైతూ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సవ్యసాచి’ రెండూ ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ సమంతతో కలిసి నటించిన మజిలీ సినిమాపైనే ఉన్నాయి. ఎప్రిల్ 5న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ హీరోలందరికీ ఇప్పటికిప్పుడు ఓ విజయం వస్తే తప్ప ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారన్న సంగతి ప్రేక్షకులకు గుర్తు కూడా ఉండదు. మరి వీళ్ల జాతకాలు ఈ 2019లో అయినా మారతాయో లేదో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allari naresh, Gopichand, Naga Chaitanya, Nithiin, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood