టాలీవుడ్ డ్రగ్స్ (Tollywood Drugs case) కేసు ప్రధానంగా తారల చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసులో తారలందరికీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ (Excise department) క్లీన్ చిట్ ఇచ్చింది. వారెవరికైనా డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న విషయాలు బయటపడలేదని కోర్టుకు తెలిపింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసులు తేలిపోయాయనుకున్నారు. కానీ.. కొత్తగా ఈడీ (ED) ఈకేసులో నిజాలు వెలికి తీయాలని ప్రయత్నిస్తూండటంతో టాలీవుడ్‌లోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (Enforcement Directorate) షాక్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ తమకు టెక్నికల్ సాక్ష్యాలు ఇవ్వడం లేదని ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్డు (High court)అప్పట్లో విచారణ జరిపింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో వేసిన పిటిషన్ విచారణ టైంలో ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని పిటీషనర్ తరుపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వివరించారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో తెలంగాణ ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని తెలిపారు. పలువాయిదాల అనంతరం కొద్దిరోజుల కిందటే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood Drugs case) లో ఈడీ దర్యాప్తునకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.
దర్యాప్తు (Investigation) కు సమర్పించాల్సిన రికార్డులన్నీ ఈడీ దరఖాస్తు చేసి 15రోజుల వ్యవధిలోపు ఇవ్వాలని తెలిపింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన కాల్ డేటా రికార్టులను నెల రోజుల్లోపు ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణ ముగించిన హైకోర్టు... ఈ కేసును సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్దలకు అప్పగించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో ఈడీ ప్రభుత్వానికి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయమై ఆధారాలు అందించాలని కోరింది. ఇప్పటికే ఆరు లేఖలు రాసింది. అయితే ఈడీ అడిగిన వివరాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కేసు మరో మలుపు తిరిగింది.
డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది. సినీతారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదని ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఆరు లేఖలు వ్రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా అంటోందని ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో తెలిపింది. దీంతో సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ ల పై చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్లో ఈడీ పేర్కొంది. గతంలో తాము సేకరించిన ఆధారాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయన్న ఎక్సైజ్ శాఖ గతంలో వాదించింది. కానీ అది నిజం కాదని.. ట్రయల్ కోర్టులో లేవని ఈడీ అంటోంది.
.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Telangana, Tollywood drugs case