Thalaivii movie review: కంగనా రనౌత్ ‘తలైవి‘ సినిమా రివ్యూ.. ‘అమ్మ’కు అందమైన నివాళి..

తలైవి మూవీ రివ్యూ (Thalavii movie review)

Thalaivii movie review: జయలలిత (Jayalalitha) బయోపిక్ అంటే ఏం చూపిస్తారు.. అమ్మ భజనే కదా చాలా మంది అనుకున్నారు. ఎన్టీఆర్ లాంటి బయోపిక్స్ ఫ్లాప్ అవ్వడంతో ఇలాంటి సినిమాలపై పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదు ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో జయలలిత బయోపిక్ వస్తుంది. తలైవి (Thalaivii movie review) భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 10న థియేటర్స్ ప్లస్ ఓటిటిలో విడుదల కానుంది. మరి జయ సినిమా అంచనాలు అందుకుందా.. లేదంటే మిగిలిన బయోపిక్స్ వెలుగులు చూపించి చీకట్లను మూసేసారా..?

  • Share this:
నటీనటులు: కంగన రనౌత్, అరవింద్ స్వామి, సముద్ర ఖని, రాధా రవి, భాగ్య శ్రీ, మధుబాల తదితరులు
కథ: విజయేంద్ర ప్రసాద్
సినిమాటోగ్రఫర్: విశాల్ విట్టల్
ఎడిటర్: ఆంటోనీ, భల్లు సలూజ
సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్
నిర్మాతలు: విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, బృందా ప్రసాద్
దర్శకుడు: ఏఎల్ విజయ్

జయలలిత (Jayalalitha) బయోపిక్ అంటే ఏం చూపిస్తారు.. అమ్మ భజనే కదా చాలా మంది అనుకున్నారు. ఎన్టీఆర్ లాంటి బయోపిక్స్ ఫ్లాప్ అవ్వడంతో ఇలాంటి సినిమాలపై పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదు ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో జయలలిత బయోపిక్ వస్తుంది. తలైవి (Thalaivii movie review) భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 10న థియేటర్స్ ప్లస్ ఓటిటిలో విడుదల కానుంది. మరి జయ సినిమా అంచనాలు అందుకుందా.. లేదంటే మిగిలిన బయోపిక్స్ వెలుగులు చూపించి చీకట్లను మూసేసారా..?

కథ:
జయలలిత (కంగన రనౌత్) ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా కూడా పరిస్థితుల కారణంగా మళ్లీ పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. 16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్‌ను చేస్తుంది. చాలా చిన్న వయసులోనే అతిపెద్ద స్టార్ హీరో అయిన ఎంజేఆర్ (అరవింద్ స్వామి)తో నటించే అవకాశం వస్తుంది. ఆ తర్వాత తమిళనాడులో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి. జయ కూడా సూపర్ స్టార్ అయిపోతుంది. కానీ అదే సమయంలో ఎంజేఆర్ పక్కనే ఉండే కొందరు వ్యక్తులకు జయ ఎదుగుదల నచ్చదు. మరీ ముఖ్యంగా ఎంజేఆర్‌కు దగ్గరవుతుందని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో ఎంజేఆర్ రాజకీయాల్లో బిజీ అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. రాజకీయాలే వద్దనుకున్న జయ ఎందుకు అక్కడికి వస్తుంది.. చివరికి ఆమె ముఖ్యమంత్రిగా ఎలా మారింది అనేది కథ..

కథనం:
ఈ రోజుల్లో బయోపిక్ అంటే కేవలం భజన మాత్రమే కనిపిస్తుంది. నిజాలు దాచేసి లేని నిజాలు ఉన్నట్లు చూపిస్తున్నారంటూ కొన్ని సినిమాలకు విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో తలైవి విడుదలైంది. తమిళ ప్రజలు అమ్మగా పూజించే జయలలిత బయోపిక్ ఇది. జయ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. వాటన్నింటినీ చూపించాలంటే మాత్రం చరిత్ర అవుతుంది. అందుకే దర్శకుడు విజయ్ కూడా జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే చూపించాడు. మొదటి సీన్‌లోనే అసెంబ్లీలో అమ్మకు పరాభవం.. ఆ తర్వాత జయ శపథం.. అక్కడ్నుంచి మొదలైన సినీ ప్రయాణం.. మధ్యలో ఎంజిఆర్‌తో బలమైన బంధం.. అది నచ్చక పార్టీ సభ్యులు చేసే అవమానం.. అన్నింటిని తట్టుకుని నిలబడిన జయ ధైర్యం.. ఇలా ఒక్కటేంటి.. ఒక్క సినిమాలో అన్నీ సమపాళ్ళలో తూకమేసినట్లు చూపించాడు దర్శకుడు విజయ్. జయలలిత జీవితం గురించి చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా ఆమె సినీ కెరీర్ ఉంటుంది.. అక్కడ కాస్త కనెక్టివిటీ మిస్ అవుతుంది మన ప్రేక్షకులకు. 16 ఏళ్ళ వయసులోనే హీరోయిన్‌గా వచ్చిన జయలలిత.. 30 ఏళ్లకే ఎందుకు రిటైర్ అయిపోవాల్సి వచ్చిందో కూడా క్లియర్‌గా చూపించారు మేకర్స్.
రాజకీయాలే వద్దనుకున్న ఆమె.. అందులోకి ఎందుకు రావాల్సి వచ్చిందో చాలా చక్కగా సీన్స్ డిజైన్ చేసుకున్నారు. సినిమా మొత్తంలో బెస్ట్ సీన్.. జయ లలితను ఓ పిల్లాడు అమ్మ అని పిలవడం. నిజంగా ఆ ఒక్క సీన్‌తోనే తమిళ ప్రజల గుండెల్లో జయలలిత ‘అమ్మ’లా ఎలా నిలిచిపోయిందో చూపించాడు దర్శకుడు విజయ్. ఆ సీన్ తెరకెక్కించిన తీరు అద్భుతం.. గూస్ బంప్స్ అంటారు కదా.. అలాంటి సన్నివేశం అది.సెకండాఫ్ అయితే చాలా బాగుంది.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చే సీన్స్ అన్నీ సూపర్‌గా డిజైన్ చేసారు. జయలలిత గురించి మరింత తెలియాలన్నా.. ఆమెలోని మాస్ లీడర్ పూర్తిగా చూడాలన్నా కూడా ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అమ్మ ప్రేమను.. కోపాన్ని రెండూ సరిగ్గా బ్యాలెన్స్ చేసాడు దర్శకుడు విజయ్. కేవలం ఆమె విజయాన్ని మాత్రమే కాకుండా.. జయలోని పొగరును కూడా చూపించాడు దర్శకుడు విజయ్. మరీ ముఖ్యంగా ఎంజిఆర్, జయలలిత పాత్రల మధ్య సన్నివేశాల నీట్‌గా ప్రజెంట్ చేసాడు. నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి.. ఈ రెండు కోణాలు జయలో ఉన్నాయి.. అలాగే సినిమాలోనూ ఉన్నాయి. సొంత పార్టీలోనే జయలలితకు జరిగిన అవమానాలను పూస గుచ్చినట్లు చూపించాడు దర్శకుడు విజయ్. ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాక బోర్ కొడుతుందేమో కానీ తమిళంలో మాత్రం అదిరిపోవడం ఖాయం. అలాంటి సీన్స్ మన దగ్గర కొన్ని కట్ చేసుంటే తలైవి మరింత బాగుండేది.

నటీనటులు:
కంగన రనౌత్‌ను జాతీయ ఉత్తమ నటి ఎందుకంటారో.. తలైవి చూస్తే అర్థమైపోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా చేసింది కంగన. ముఖ్యంగా తను ప్రేమించిన వ్యక్తి దూరం పెడుతున్నపుడు ఆమె పడే బాధను స్క్రీన్‌పై బాగా చూపించింది. అలాగే ఎంజిఆర్‌గా అరవింద్ స్వామి చాలా బాగా నటించాడు. ఆయన అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోసాడు. జయ అమ్మ పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ బాగుంది. ఎంజిఆర్ భార్య పాత్రలో రోజా ఫేమ్ మధుబాల ఉన్నంతలో చాలా బాగా నటించింది. కరుణానిధిగా నాజర్ బాగున్నాడు. మిగిలిన వాళ్లు కూడా వాళ్ల వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:
తలైవి సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ మ్యూజిక్. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం చాలా బాగుంది. పాటలు అంతగా కనెక్ట్ కాలేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కట్ చేయొచ్చేమో అనిపించింది. తమిళనాట ఓకే కానీ మన దగ్గర ఆ సినిమా సన్నివేశాలు అంతసేపు చూడటం కష్టమే. విజయేంద్ర ప్రసాద్ కథ బాగుంది. జయలలిత జీవితం మొత్తం కాకుండా ఆమె లైఫ్‌లోని ప్రధాన ఘట్టాలను బాగా రాసుకున్నాడు. దాన్ని తెరపై చూపించడంలో విజయ్ కూడా సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే డిజైన్ చేసాడు.

చివరగా ఒక్కమాట:
ఓవరాల్‌గా తలైవి సినిమా.. ‘అమ్మ’కు అందించే అందమైన నివాళి..

రేటింగ్: 3/5
Published by:Praveen Kumar Vadla
First published: