Thalaivi: ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. పేరు మోసిన రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, హీరోయిన్ల జీవితాలతో పాటు బీ గ్రేడ్ హీరోయిన్ల జీవితాలను వెండితెరపై తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలోనే ఒకప్పటి కథానాయక, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితంపై పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ సినిమా తెరకెక్కుతోంది. జయలలిత విషయానికొస్తే.. ఓ సినీ తారగా, ఓ పార్టీ అధినేత్రిగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ ఐరన్ లేడీగా... జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి.
దీంతో పాటు రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో ‘ది ఐరన్ లేడి’ అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. జయలలిత జీవితంపై కంగనా హీరోయిన్గా ‘తలైవి’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నాడు. ఇప్పటికే ఎంజీఆర్ వర్ధంతి సందర్భంగా విడుదల చేసిన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఎంజీఆర్, జయలలిత పాత్రల్లో కంగనా, అరవింద్ స్వామిల రొమాంటిక్ లుక్‌ను విడుదల చేసారు.
ఇక సినీ రంగంలో పాటు రాజకీయ రంగంలో జయలలిత గురువు ఎంజీఆర్. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తాజాగా విడుదల చేసిన లుక్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంజీఆర్ ఏఐఏడీఎంకే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు చనిపోయేవరకు సీఎం కుర్చోలనే ఉన్నారు. ఎంజీఆర్ కన్నుమూసిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జయలలిత.. సీఎంగానే కన్నుమూసారు. ఇక ఆమె కన్నుమూయడం కూడా ఓ మిస్టరీనే. మొత్తంగా సినిమాను తలదన్నే స్క్రీన్ ప్లే జయలలిత జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇపుడవన్ని తలైవి సినిమాలో చూపిస్తున్నారు.ఈ సినిమాకు ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 17, 2021, 14:49 IST