Home /News /movies /

TELANGANA POET AND TELUGU CINEMA WRITER DASARADHI KRISHNAMACHARYULU BIRTH ANNIVERSARY TA

స్మృతిలో: తెలంగాణ సాహితీ సౌరభం దాశరథి కృష్ణమాచార్య జయంతి..

దాశరథి కృష్ణమాచార్యులు (File/Photo)

దాశరథి కృష్ణమాచార్యులు (File/Photo)

ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనదో విశిష్టశైలి. రచనలో వైవిధ్యం, గీతాల్లో మాధుర్యం తొణికిసలాడుతుంది. తెలుగు సినిమా పాటలను పరిపుష్టం చేసిన మహాకవుల్లో ఆయన ఒకరు.ఆయనే.. ప్రముఖ కవి దాశరథి. నా తెలంగాణ కోటిరతనాల వీణ.. అని నినదించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. నేడు ఆ మహాకవి జయంతి.

ఇంకా చదవండి ...
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనదో విశిష్టశైలి. రచనలో వైవిధ్యం, గీతాల్లో మాధుర్యం తొణికిసలాడుతుంది. తెలుగు సినిమా పాటలను పరిపుష్టం చేసిన మహాకవుల్లో ఆయన ఒకరు. ఎటువంటి సాహిత్యమైన ఆయన కలానికి గులాము కావాల్సిందే. ఆయనే.. ప్రముఖ కవి దాశరథి. నా తెలంగాణ కోటిరతనాల వీణ.. అని నినదించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. నేడు ఆ మహాకవి జయంతి. తెలుగు సినిమా పాటల్లో ప్రాసకు, భావానికీ అగ్రప్రాధాన్యం ఇచ్చిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. సినీ కవి కాకముందే  గొప్పకవిగా పేరు గడించాడు. ఆయన కవితలో ఉర్దూ మిళితమైన తెలుగు గుబాళిస్తుంది. కేవలం కవిగానే కాకుండా... పరిశోధకుడిగా,కవిగా, రచయతగా, విద్యావేత్తగా సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేసిన అనితర సాధ్యుడు దాశరథి. సినిమా పాట ఆయన సాహిత్యంలో ఓ కోణం మాత్రమే.దాశరథికి ప్రాచీన సాహిత్యంపై మంచి పట్టు ఉండేది. ఆయన రాసిన పాటల్లో అది ప్రస్పుటంగా కనిపించేది.  దేవులపల్లి, శ్రీశ్రీ, సినారె కోవలోనే కవిగా పాపులర్ అయ్యాక సినీరంగంలో.... పాటల రచయతగా తన ప్రాభవాన్ని చూపారు.  సాధారణ పదాల్లోనే అందమైన భావుకతను ఒలికిస్తాయి. అందుకే తెలుగు సినీ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు దాశరథి.

దాశరథి కృష్ణమాచార్యులు (File/Photo)


తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి.. నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి తన వంతు సహకారం అందించారు. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య...1925 జూలై 22 వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు.

దాశరథి కృష్ణమాచార్యులు కాంస్య విగ్రహం(File/Photo)


దాశరథి ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ఖమ్మం జిల్లా మధిరలో సాగింది. ఆయన చదువంతా ఉర్దూ మీడియంలో కొనసాగింది. అప్పుడున్నది నిజాం పాలన. అందుకే దాశరథి తప్పనిసరిగా ఉర్దూలో చదుకోవాల్సి వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషు సాహిత్యంలో బిఎ పట్టా పొందారు. ఉర్దూ, ఇంగ్లీషుతో పాటు సంస్కృతం, తెలుగు భాషపై మంచి పట్టు సాధించారు కృష్ణమాచార్యులు. చిన్న తనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. అదే ఆయన్ని కవిత్వం వైపు మళ్లించాయి.

Telugu Cinema Writer dasharathi Krishnama charya Death Anniversary
దాశరథి కృష్ణమాచార్యులు (File/Photo)


ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నారు దాశరథి. ఆతర్వాత రెండో ప్రపంచ యుధ్థం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్ పెక్టర్ గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి తాకని ప్రక్రియ లేదు. ఎన్నో కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసి తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసారు దాశరథి.  తెలంగాణ పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. ఆ తర్వాత సినీకవిగా ఆయన రాసిన పాటలు ఈనాటికీ శ్రోతల గుండెల్లో మారుమోగుతునే వున్నాయి. అవి నేటి తరం వారిని కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

తెలంగాణ కవిగా ప్రత్యేక గుర్తింపు (File/Photo)


దాశరథి రాసిన పాటలు పండితపామర జనరంజకంగా ఉండి శ్రోతలను అలరించేలా ఉంటాయి. తరాలతో సంబంధం లేకుండా మనుషుల్లో ఉండే సున్నితమైన భావాలు ఆయన రచనల్లో కనిపిస్తాయి. అందుకే ఆయన రాసిన పాటలు ఈనాటికీ వసివాడలేదు. అలాంటి అసలు సిసలైన సినీ కవుల కాలంలో దిగ్గజం లాంటివాడు దాశరథి.దాశరథి పేరు చెబితే తెలంగాణ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. కవిత్వంలోనే కాదు, సినిమా పాటల్లోనూ ఉన్నత సాహిత్య విలువలకు పెద్దపీట వేసిన అద్భుత సాహితీ వేత్త దాశరథి. తెలంగాణ సాహిత్యంలో దాశరథిది బహుముఖ ప్రతిభ. 1961లో మనసు కవి ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘వాగ్ధానం’ సినిమాతో దాశరథి సినీకవిగా పరిచయమయ్యారు. ఇందులో ఆయన రాసిన ‘నా కంటిపాపలో నిలిచిపోరా’ పాట ఈనాటికీ తెలుగు సినిమా పాటల చరిత్రలో శిఖరస్థానంలో నిలిచిపోయింది. అదే ఏడాది దుక్కిపాటి మధుసూధనరావు నిర్మించిన ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలోని అన్ని పాటలు రాశారు. ఇక అప్పటి నుంచి సినీకవిగా స్థిరపడిన దాశరథి.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

ఇద్దరు మిత్రులు సినిమాతో వెనుదిరిగి చూసుకోలేదు (Youtube/Credit)


తెలుగులో ఖవ్వాలి గీతాలకు శ్రీకారం చుట్టిన ఘనత దాశరథిది. ఎక్కువగా అన్నపూర్ణ, ఆదుర్తి వారి సినిమాలకు పాటలు రాశారు. దాశరథి సినిమాల్లోకి వచ్చేనాటికే పరిశ్రమలో సీనియర్ సముద్రాల, పింగళి, కొసరాజు, శ్రీశ్రీ, ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర వంటి దిగ్గజాలు సినీ కవులుగా ప్రసిద్ధులు. అటువంటి మహామహుల మధ్య తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం సామాన్య విషయం కాదు. అయినా.. మొదటి సినిమాతోనే సినీ గేయరచయతగా దాశరథి పేరు మారుమోగింది.ఆ రోజుల్లో  మనుసు పాటలకు, విరహ గీతాలకు ఆత్రేయ....జానపదాలకు కొసరాజు...అభ్యుదయ గీతాలకు శ్రీశ్రీ...భావగీతాలకు కృష్ణశాస్త్రి వంటివారు పేరు గడించారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా భక్తి, ఖవ్వాలి, వీణ పాటలు రాసి మెప్పించాడు దాశరథి. బ్రాండ్‌కు భిన్నంగా పాటలు రాసి మెప్పించిన ఘనత కూడా ఆయనదే.కన్నెవయసులో దాశరథి రాసిన ఏ దివిలో విరిసిన పారిజాతమో  పాట ఆరోజుల్లో సంగీత ప్రపంచంలో మారుమోగాయి.

దాశరథి, సి. నారాయణ రెడ్డి (File/Photo)


ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకి ఆస్థానకవిగా పాటలు రాశారు దాశరథి. ‘ఓ బొంగారాల బుగ్గలున్న దాన’ ...అలాగే మూగమనసులో ఆయన రాసిన గోదారి గట్టుంది పాటలు.. ఆయన కవితా పటిమకు నిదర్శనంగా నిలిచాయి. ‘తేనె మనసులు’ సినిమాలో ‘దివి నుంచి భువికి దిగివచ్చే’ ....అలాగే నన్ను వదిలి నీవు పోలేవులే’ పాటలను హమ్ చేయని సంగీతాభిమానులుండరు.ఆదుర్తి ఆరోజుల్లో ఒక సామాజిక ప్రయోజాన్ని ఆశించి ‘సుడి గుండాలు’ సినిమా తీసాడు.

ఏఎన్నార్ సినిమాలకు ఎక్కువగా పాటలు రాసిన దాశరథి (File/Photo)


ఆ చిత్రంలో స్వాతంత్ర్య పోరాటం, దేశభక్తి గురించి దాశరథి ఒక పెద్ద పాటను రాశారు. దానికి ఆదుర్తి దాశరథిని రెట్టింపు పారితోషకాన్ని ఆఫర్ చేయగా నేను దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవాడిని.  నేను ఈ సినిమాకి పైసా తీసుకోను అని అన్నారు. అది దాశరథిలోని దాతృత్వ గుణానికీ ఒక ఉదాహరణ మాత్రమే.

దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో ప్రత్యేక అనుబంధం (File/Photo)


రారా కృష్ణయ్యా.. అనే పాట అద్భుతం...నిజమైనా కల అయినా నిరాశలో ఒకటేలే.... ఈ వేళ నాలో ఎందుకో ఆశలు, గులాబీలు పూచే వేళ కోరికలు పెంచుకో....అలాగే ముత్యాలు జల్లు కురిసే అంటూ తన గానామృతంతో ప్రేక్షకులపై పాటల వర్షం కురిపించాడు దాశరథి.ఆనాటి నిజాం నిరంకుశత్వాన్ని జైలు గోడల మధ్యే గర్జించిన కవిబెబ్బులి దాశరథి. తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన కలం వీరుడాయన. చివరికి పోలీసు చర్య తర్వాత జైలు నుంచి విడుదయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్మాతల్లో దాశరథి ఒకరు. 1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా దాశరథి ప్రతిభకు మెచ్చి రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, పురస్కారాలు వరించాయి.

దాశరథి కృష్ణమాచార్యులు (File/Photo)


కవిగా.. సినిమా పాటల రచయితగా ఎన్నో రచనలు చేసాడు దాశరథి. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులో గాలిబ్ గీతాల పేరున అనువదించాడు. తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు.. ఇప్పటికీ ఎందరో తెలంగాణ వాదులకు ఉత్తేజాన్ని కలిగించాయి. ఉద్యమకారులకు స్పూర్తినిచ్చాయి. దాశరథి కృష్ణమాచార్య 5 నవంబర్  1987 న అనంత లోకాలకు పయనమయ్యాడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన అందించిన పాటల సుమాలు.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telangana, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు