రామ్ గోపాల్ వర్మ సినిమాలన్నీ కాంట్రవర్సీల చుట్టూనే తిరుగుతుంటాయి. ఆయన రెగ్యులర్ సినిమాలు చేయడం ఎప్పుడో ఆపేసాడు. ఇప్పుడు కూడా ఈయన చేసిన ఓ సినిమా వివాదంలో ఇరుక్కుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసును ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాగా తీసాడు. దిశ ఎన్‌కౌంటర్ పేరుతో ఈ సినిమాను ఎప్పుడో పూర్తి చేసాడు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే కోర్టు అనుమతి కోసం వేచి చూస్తున్నారు దర్శక నిర్మాతలు. చివరికి ఇలాంటి కథను కూడా సినిమాగా తీసి వాళ్ల కుటుంబాలతో ఆడుకుంటావా.. వాళ్ల ఎమోషన్స్‌తో నీకు పని లేదా అంటూ వర్మను ఎన్ని రకాలుగా విమర్శించినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. తాను చేయాలనుకున్న పని చేసి తీరుతాను అంటున్నాడు. దిశతో ఈ సినిమాకు సంబంధం లేదంటున్నాడు ఈయన. ఈ సినిమాను గతేడాది దిశ చనిపోయిన రోజే ఆన్‌లైన్‌లో విడుదల చేయాలనుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కానీ కుదర్లేదు.. ఇన్నాళ్ళకు అన్ని అడ్డంకులు తొలగించుకుని సినిమాను విడుదల చేయాలనుకున్నాడు.
ఈ చిత్రాన్ని నిలిపేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు హై కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆపాలంటూ డిమాండ్ చేసాడు. ఇప్పుడు ఈ కేసులో నిందితుల కుటుంబ సభ్యులు కూడా దిశ ఎన్‌కౌంటర్ చిత్రాన్ని వెంటనే ఆపేయాలంటూ హైకోర్టులోని జ్యుడీషియల్ కమిషన్ కార్యాలయానికి ఆశ్రయించారు. ఇప్పుడు సినిమా రిలీజ్‌పై రెండు వారాలు హై కోర్టు స్టే విధించింది. సినిమా నిర్మాతల పేర్లపై పిటిషన్‌లో గందరగోళం ఉందని హై కోర్టు పేర్కొంది.
నిర్మాత రామ్ గోపాల్‌వర్మ అని చెప్పాడు పిటిషనర్. అయితే నిర్మాత వర్మ కాదు అనురాగ్ అని కోర్టుకు న్యాయవాది తెలిపారు. దిశ సినిమా పేరును నిశా ఎన్‌కౌంటర్‌గా మార్చామని ఈ సందర్భంగా న్యాయవాది తెలిపారు. కేవలం దిశ కుటుంబ సభ్యుల నుంచే కాదు.. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడి ఎన్‌కౌంటర్ చేయబడ్డ జొళ్లు శివ, జొళ్ళు నవీన్, చెన్నకేశవులు, మహమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇందులో తమ వాళ్ళను పూర్తి స్థాయి విలన్స్‌గా చూపిస్తున్నారని వాళ్లు కోర్టుకు విన్నవించుకున్నారు. ఇప్పటికే చచ్చిపోయిన వాళ్లను మరింత చంపేయాలని ఈ సినిమా తీస్తున్నారా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని ఈ చిత్రాన్ని ఆపాలంటూ వర్మను వాళ్లు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పిటీషినర్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి కూడా కోర్టుకు ఇదే విన్నవించారు. నిందితుల కుటుంబాలను మరింత చిధ్రం చేయడానికి ఈ సినిమా చేస్తున్నారా అంటూ ఆయన కోరాడు. సుప్రీం కోర్టు నియమించిన కమీషన్‌కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు. ఓవైపు ఎంక్వైరీ నడుస్తుంటే మరోవైపు అవేం పట్టించుకోకుండా దిశ కథను సినిమాగా ఎలా తెరకెక్కిస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. న్యాయవాది కూడా ఇదే ప్రశ్నించడంతో కోర్టు కూడా ఆయన వాదనతో ఏకీభవించింది. ఈ క్రమంలోనే అప్పట్లో వర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడేమో ఈ సినిమాను రెండు వారాల పాటు నిలిపేయాలని ఆదేశించింది. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha accused Encounter, RGV, Telugu Cinema, Tollywood