‘గీతగోవిందం’తో పాటు ఆ సినిమా కూడా లీకయ్యిందా!

ఫిలింనగర్ నుంచే పైరసీ అయిన ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలు... నిందితుడి అరెస్ట్... కేసు నమోదు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 12, 2018, 5:26 PM IST
‘గీతగోవిందం’తో పాటు ఆ సినిమా కూడా లీకయ్యిందా!
గీతగోవిందం, ట్యాక్సీవాలా పోస్టర్లు
  • Share this:
విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే, ‘గీతగోవిందం’ సినిమా పైరసీకి గురవ్వడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమాతో పాటు అనేక వాయిదాలు పడుతున్న విజయ్ దేవరకొండ చిత్రం ‘ట్యాక్సీవాలా’కూడా లీకయ్యిందనే షాకింగ్ విజయం తాజాగా వెల్లడైంది. అయితే ఈ పైరసీ వెనక చిత్ర యూనిట్‌కి చెందిన వ్యక్తుల హస్తం ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆగస్టు 15న విడుదలవుతున్న ‘గీత గోవిందం’ సినిమాపై యూత్‌లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సంచలన విజయం సాధించాయి కూడా. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్న సమయంలో పైరసీ సీడీలు బయటికి వచ్చాయనే విషయం తెలియడంతో హీరో విజయ దేవరకొండ ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో చేతులు మారుతున్న ‘గీత గోవిందం’ సినిమా పైరసీ సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పట్టుకున్న పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న ‘టాక్సీవాలా’ చిత్రం కూడా పైరసీ బారిన పడినట్టు గుంటూరు పోలీసులు కనిపెట్టారు. గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ఈ రెండు సినిమాలను పంచుకున్నట్టు గుర్తించారు.

ఆదివారం ఉదయం ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం బయటికి వచ్చింది. అమరావతి పరిధిలోని తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీకి చెందిన ఓ అమ్మాయి నుంచి మిగిలిన విద్యార్థులకు ఈ పైరసీ వీడియోలు పంపిణీ జరిగినట్టు గుర్తించింది గుంటూర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగం. ఆ అమ్మాయిని నిలదీయగా...హైదరాబాద్‌లో సినీ డిజిటల్ ఎడిటింగ్‌లో పనిచేసే ఓ వ్యక్తి ద్వారా తనకు ఈ వీడియోలు వచ్చినట్టు తెలిపింది. దాంతో పక్కా సాక్ష్యాధారాలతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. ఫిలింనగర్‌లో డేటా డిజిటల్ బ్యాంక్ అడ్మిన్‌గా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పడవల రాజేశ్‌గా గుర్తించారు. గీతాఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట రామాంజనేయులు నుంచి ఎడిటింగ్ కోసం హర్డ్ డిస్క్ తీసుకున్న రాజేశ్, ‘గీతగోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సినిమాలను కాపీ చేసినట్టు తెలిసింది. ఈ కాపీని విజయ్ దేవరకొండను అమితంగా ఇష్టపడే తన స్నేహితురాలికి పంపించాడు. ఆమె తన స్నేహితులకు పంపడంతో చేతులు మారుతూ వచ్చిందని వివరించారు పోలీసులు. రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.
Published by: Ramu Chinthakindhi
First published: August 12, 2018, 5:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading