Udhayanidhi Stalin: స్టార్ హీరో‌పై దొంగతనం కేసు.. ఇటుకను కొట్టేశాడని బీజేపీ ఫిర్యాదు

ఉదయనిధి స్టాలిన్

Uadhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను స్థానిక బీజేపీ నేత ఒకరు సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురై ఎయిమ్స్ నుంచి ఇటుకను కాజేసి చేసి తీసుకొచ్చారని.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో దాన్ని ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Share this:
    తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అభ్యర్థులంతా గ్రామాల్లో తిరుగుతూ ఓట్ల కోసం పడరానికి పాట్లు పడుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తాము చేయబోయే పనులను గురించి చెబుతున్నారు. ఐతే ఇటీవల స్టాలిన్ తనయుడు, కోలీవుడ్ హీరో, చెపాక్ ట్రిప్లికేన్ డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కేంద్రం ఇచ్చిన ఎయిమ్స్ ఇదే అంటూ ఓ ఇటుకను చూపిస్తూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ ఆయనపై దొంగతనం కేసుపెట్టింది. ఇటుకను కొట్టేశాడని కమలం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    మంగళవారం ఉదయనిధి స్టాలిన్ సత్తూరు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా మధురై ఎయిమ్స్‌ విషయంలో కేంద్రం తీరును ఆయన తూర్పారబట్టారు. 2019లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి వెళ్లారని.. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదని విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇదిగో మధురై ఎయిమ్స్‌ను తీసుకొచ్చానంటూ ఓ ఇటుకను జనాలకు చూపించారు. దానిపై ఎయిమ్స్ అని ఇంగ్లీష్ అక్షరాల్లో రాసి ఉంది. ఇటుకను చూపించి ఇదే ఎయిమ్స్ అనడంతో ప్రజలంతా నవ్వారు. ఇంతకు మించి బీజేపీ, అన్నాడీఎంకే వారు ఏమీ చేయరని విరుచుకుపడ్డారు ఉదయనిధి స్టాలిన్.

    ఐతే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను స్థానిక బీజేపీ నేత ఒకరు సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురై ఎయిమ్స్ నుంచి ఇటుకను కాజేసి చేసి తీసుకొచ్చారని.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో దాన్ని ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగల బారి నుంచి మధురై ఎయిమ్స్ నిర్మాణాన్ని కాపాడాలని.. ఆ ఇటుకను స్వాధీనం చేసుకోవాలని పోలీసుల కోరాడు. బీజేపీ నేత ఫిర్యాదుతో అక్కడి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ఈ వ్యవహారం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


    కాగా, తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అన్నాడీఎంకే, బీజేపీలు పలు చిన్న పార్టీలతో కలిసి కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక డీఎంకే, కాంగ్రెస్ కూడా ఇతర పక్షాలతో కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం కూడా అభ్యర్థులను పోటీలో దింపింది. ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని ఎలాగైనా ఓడించాలని డీఎంకే వ్యూహాలను సిద్ధం చేసింది. అటు పలు ఒపీనియన్ పోల్స్ కూడా డీఎంకేకే అధికారం కట్టబెట్టాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల్లో ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయోనని అంతటా ఆసక్తి నెలకొంది. మే 2న కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.


    మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్‌లో న్యూస్ 18 తెలుగు (News18 Telugu) ఛానెల్ సబ్ స్క్రయిబ్ చేయండి.
    Published by:Shiva Kumar Addula
    First published: