ఒకప్పుడు విజయ్ సినిమాలకు తెలుగులో పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. ఈయన కంటే తర్వాత వచ్చిన సూర్య, విక్రమ్, అజిత్ లాంటి హీరోలు కూడా తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నారు. అంతెందుకు పదేళ్ల కింద వచ్చిన కార్తికి కూడా తెలుగులో అదిరిపోయే మార్కెట్ ఉంది. కానీ అప్పుడెప్పుడో 1992లో వచ్చిన విజయ్ మాత్రం తెలుగు ఇండస్ట్రీని అస్సలు పట్టించుకోలేదు. కేవలం తమిళంలోనే ఉండిపోయారు విజయ్. ముఖ్యంగా భాష సమస్యతో ఇతర ఇండస్ట్రీలను పట్టించుకోలేదు విజయ్. అయితే వరసగా అందరూ తెలుగులోనూ మార్కెట్ సంపాదించుకోవడంతో ఈ మధ్యే ఇక్కడ కూడా తన సినిమాలను విడుదల చేస్తున్నారు విజయ్. అయితే వాళ్లందరి కంటే వేగంగానే విజయ్ తెలుగులో భారీ మార్కెట్ సంపాదించుకున్నారు. తుపాకి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. శంకర్ స్నేహితుడు, పులి, అన్న సినిమాలతో నిరాశ పరిచాడు. అయితే ఆ తర్వాత విడుదలైన జిల్లా పర్లేదనిపించింది. అక్కడ్నుంచే విజయ్ హవా తెలుగులోనూ మొదలైంది. పోలీసోడు సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ఆ తర్వాత విడుదలైన అదిరింది అదిరిపోయే వసూళ్లు తీసుకొచ్చింది.
మురుగదాస్ తెరకెక్కించిన సర్కార్ 9 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ వెంటనే అట్లీ కుమార్ తెరకెక్కించిన విజిల్ సినిమా 10 కోట్ల మార్క్ అందుకుంది. మొన్న విడుదలైన మాస్టర్ సినిమా సైతం 12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకోవడంతో త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు విజయ్. ఈ మధ్యే వంశీ పైడిపల్లి చెన్నై వెళ్లి విజయ్‌కు మంచి కథ వినిపించారని తెలుస్తుంది.
దీనికి విజయ్ కూడా ఓకే చెప్పారని.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడానికి రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిర్తే ఇదే తెలుగులో విజయ్ చేయబోయే స్ట్రెయిట్ సినిమా అవుతుంది. గతంలోనే ఊపిరి సినిమాలో కార్తిని డైరెక్ట్ చేసారు వంశీ. ఇప్పుడు మరోసారి ద్విభాషా చిత్రానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు విజయ్. దీని తర్వాత వంశీ సినిమాపై క్లారిటీ రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood, Vijay