తమిళనాడు ముఖ్యమంతి ఎడప్పడి కె.పళనిస్వామి స్టార్ నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కమల్‌హాసన్‌పై నిప్పులు చెరిగారు. ఆయన కమల్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు పళనిస్వామి ఎందుకు కమల్‌ను విమర్శించారు. ఏం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే.. తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందనే సామెత వినే ఉంటాం. అలాగే సినిమాలకు, రాజకీయాలకు అవినావభావ సంబంధం ఉంటుంది. అదే రిలేషన్‌తో సినిమాల్లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ నటుడు రాజకీయ నాయకుడుగా మారుతాడు. ఇది మనం అన్నీ చిత్ర పరిశ్రమల్లోనూ చూశాం. తాజాగా తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులైన రజినీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లో ఉన్నారు. కమల్‌హాసన్ ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేయగా.. రజినీకాంత్ జనవరిలో అధికారికంగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎప్పుడైతే ఇలా స్టార్స్.. రాజకీయాల్లోకి వస్తారో, వారిపై విమర్శలు ఖాయం. ఏమాత్రం తప్పు జరిగినట్లు అనిపించినా కాసుకుని కూర్చుని ఉండే ప్రత్యర్థి వర్గం వెనుకాముందు ఆలోచించకుండా కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా కమల్‌హాసన్‌ను అలాగే టార్గెట్ చేశారు.
తమిళనాడులో ఐటీ అధికారులు చేస్తున్న దాడుల్లో లెక్కకు అందని డబ్బు పట్టుబడుతుంది. ప్రభుత్వం అవినీతి ప్రోత్సహిస్తుందంటూ కమల్ పార్టీకి చెందిన నేతలు జరుగుతున్న పరిణామాలపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి తనదైన స్టైల్లో స్పందించారు. "ఏడు పదుల వయసులో కమల్‌హాసన్ బిగ్‌బాస్ షోను నిర్వహిస్తున్నారు. ఆ షోలో ఏముంది? ఏమీ లేదు. ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా? ఆయన ప్రజలకు మంచి చేయడం లేదు. సరికదా, బిగ్‌బాస్ వంటి షో వల్ల పిల్లలు పాడైపోతున్నారు. బిగ్‌బాస్ హోస్ట్ చేసే వ్యక్తులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదు. బిగ్‌బాస్ హోస్ట్ చేయడం వల్ల కుటుంబాలు ఏమీ బాగుపడవు" అన్నారు పళనిస్వామి.
పళని స్వామి వ్యాఖ్యలపై ఇంకా కమల్‌హాసన్ స్పందించలేదు. మరి కమల్‌పై ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం రేపు రజినీకాంత్ అధికారికంగా పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఎలాంటి కామెంట్స్ చేస్తారో మరి. తమిళనాడులో ఎన్నికలకు దగ్గర పడే సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని తీరు, పదును పెరుగుతుంది. ఈసారి మాత్రం కమల్‌హాసన్, రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాడులో ఎన్నికల వేడి పెరిగిందనడంలో సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamal haasan, Palanisami, Tamil nadu, Tamil nadu Politics