ఈ రోజుల్లో షూటింగ్ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోలకు మాత్రమే కాదు ఏ నటుడికి చిన్న గాయాలు కూడా కాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయినా కూడా కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. ఇప్పుడు తమిళ హీరో ఆర్య విషయంలో కూడా ఇదే జరిగిందని తెలుస్తుంది. ఈయన సినిమా షూటింగ్‌లో గాయాలైనట్లు తెలుస్తుంది. బాలా దర్శకత్వంలో వాడు వీడు సినిమాలో నటించిన విశాల్, ఆర్య చాలా రోజుల తర్వాత ఎనిమీ సినిమాలో నటించబోతున్నారు. అరిమ నంబి, ఇరుముగన్, నోటా లాంటి సినిమాలను తెరకెక్కించిన ఆనంద్ శంకర్ ఎనిమీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పూర్తిగా యక్షన్ జోనర్‌లోనే ఎనిమీ వస్తుంది. ఇందులో విశాల్ హీరోగా నటిస్తుంటే.. ఆర్య విలన్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసారు. ప్రస్తుతం చెన్నై శివార్లలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అనుకోకుండా ప్రమాదం జరిగిందిని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆర్యకు తీవ్ర గాయాలైనట్లు ప్రచారం జరుగుతుంది.
ఆర్య, విశాల్ ఇద్దరూ యాక్షన్ సన్నివేశం కోసం బాడీ డబుల్ లేకుండా నటిస్తున్నారు. ఆ సమయంలో ఆర్యకు ప్రమాదం జరగడంతో గాయపడ్డాడని వార్తలొస్తున్నాయి. ఆసుపత్రిలో చేరిన తర్వాత అత్యవసర చికిత్స తీసుకుని వెంటనే మళ్లీ షూటింగ్‌కు వచ్చాడు ఆర్య. ఎనిమీ విశాల్‌కు 30వ సినిమా అయితే ఆర్యకు 32వ సినిమా. ఈ మధ్యే విడుదలైన ఎనిమీ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విశాల్, ఆర్యతో పాటు గద్దలకొండ గణేష్ ఫేమ్ మృణాళిని రవి కూడా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vishal, Telugu Cinema, Tollywood