చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి షూటింగ్ వేగంగా జరుగుతుంది. భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక సైరా నరసింహారెడ్డిలో చాలా విశేషాలున్నాయి. ముఖ్యంగా చిరంజీవి ఈ చిత్రం గురించి చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు కూడా జరక్కుండా అన్నీ తానే దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. తన కలల ప్రాజెక్ట్ కావడంతో పాటు 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం.. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా ఇదే కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు మెగా నిర్మాత రామ్ చరణ్.
ఇదిలా ఉంటే ఇప్పుడు సైరా క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన అంశాలు బయటికి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఇప్పుడు ఇది క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా చాలా తర్జన భర్జన పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. దానికి కారణం నిజ జీవితంలో ఉయ్యాలవాడను బ్రిటీష్ వాళ్లు ఉరి తీసి చంపేయడమే.
ఆయన తలను గుమ్మానికి 30 ఏళ్ల పాటు వేలాడదీసారంటే తెల్లోళ్లకు నరసింహారెడ్డిపై కసి ఎంతుందో అర్థమవుతుంది. అలాంటిదిప్పుడు సైరా క్లైమాక్స్ ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఉన్నది ఉన్నట్లు తీస్తే ప్రేక్షకులు చూస్తారా.. క్లైమాక్స్ లో చిరంజీవిని చంపేస్తే అభిమానులు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు అసలు అనుమానం. చివర్లో చిరంజీవిని చంపేయడం ఇష్టం లేకే అప్పట్లో ఠాగూర్ క్లైమాక్స్ కూడా మార్చేసారు.
ఇక ఇప్పుడు కూడా ఉయ్యాలవాడ రగిలించిన స్ఫూర్తితో దేశం స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడింది అనే కోణంలో సినిమాను ముగిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో నరసింహారెడ్డిని ఉరితీసే సన్నివేశాలు ఉండవని తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు రావడంతో ఇదే ఏడాది సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లాంటి వాళ్లు నటిస్తున్నారు. మరి చూడాలిక.. సైరా క్లైమాక్స్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Megastar, Ram Charan, Surender reddy, Telugu Cinema, Tollywood