తమిళ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 15 ఏళ్ల కింద గజినీ సినిమాతోనే ఇక్కడ మార్కెట్ సొంతం చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత యముడు, సింగం, 24 లాంటి సినిమాలతో ఇక్కడ స్టార్ అయిపోయాడు. దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు సూర్య సినిమాలు సత్తా చూపించాయి. అయితే కొన్నేళ్లుగా ఈయన రేంజ్‌కు సరిపోయే సినిమా మాత్రం రాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్లు వెళ్తున్నాయి కానీ ఒక్కటి కూడా నిలబడలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం ఈయన నుంచి వచ్చిన ఓ సినిమా సత్తా చూపిస్తుంది.. అందరి మనసులు గెలుచుకుంటుంది. మరీ ముఖ్యంగా ప్రశంసల వర్షం కురిపిస్తుంది ఆ సినిమా. అదే ఆకాశం నీ హద్దురా.. సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం నేరుగా ఆన్లైన్లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్య ఈజ్ బ్యాక్ అంటూ పొగిడేస్తున్నారు.
ఇక సుధ డైరెక్షన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు. నాని వి తర్వాత ఓటిటిలో విడుదలైన స్టార్ హీరో సినిమా ఇదే. అయితే వి సినిమాకు దారుణమైన పరాభవం ఎదురైంది. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన పెంగ్విన్, నిశ్శబ్ధం, మిస్ ఇండియా లాంటి సినిమాలు కూడా దారుణంగా నిరాశ పరిచాయి. దాంతో పాటు హిందీలో విడుదలైన లక్ష్మీ బాంబ్ కూడా పేలలేదు. దాంతో స్టార్ హీరోలకు ఓటిటి సెట్ అవ్వదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సూర్య సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. సినిమా బాగుంటే కచ్చితంగా ఆన్లైన్లో కూడా లాభాల పంట పండుతుందని ఆకాశం నీ హద్దురా నిరూపిస్తుంది. అమెజాన్ ఈ చిత్రాన్ని భారీ రేటుకే కొనుగోలు చేసింది.
ఇప్పుడు దానికి ప్రతిఫలం కూడా భారీగానే వస్తుంది. ఈ చిత్రంతో అమెజాన్ ప్రైమ్ పంట పండేలా కనిపిస్తుంది. రికార్డ్ వ్యూస్‌తో దుమ్ము దులిపేస్తుంది ఆకాశం నీ హద్దురా. దాంతో మరికొందరు స్టార్ హీరోలు.. దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను థియేటర్స్ కాకుండా హోమ్ థియేటర్లో విడుదల చేసుకోవచ్చంటూ ఆలోచిస్తున్నారు. సినిమా బాగుంటే ప్లాట్ ఫామ్ ఏదైనా కూడా రచ్చ చేయడం ఖాయం అని ఆకాశం నీ హద్దురా నిరూపిస్తుంది. దానికి ముందు కొన్ని చిన్న సినిమాలు కూడా సత్తా చూపించాయి. దాంతో మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా ఇప్పుడు ఆన్లైన్ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Suriya, Telugu Cinema, Tollywood