వరస పరాజయాలతో గాడితప్పిన కెరీర్‌ను రెండు వరస విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కించాడు సాయి ధరమ్ తేజ్. 2019లో వచ్చిన చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలు మంచి వసూళ్లు సాధించడంతో సాయి కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం ఈయన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యే విడుదలైన నో పెళ్లి సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పైగా సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఓ ఎమోషనల్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు సాయి.
ఈ చిత్రం తర్వాత వీరు పోట్లా కూడా సాయికి కథ చెప్పాడని తెలుస్తుంది. ఈయన త్వరలోనే ఓ భారీ పీరియాడికల్ డ్రామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ ఇందులో శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రాయలవారి పాలన నేపథ్యంలో ఈ కథను రాసుకున్నాడు వీరు పోట్ల. ఈ సినిమా కోసం 40 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సాయి కెరీర్లో ఇంత హైయ్యస్ట్ బడ్జెట్ సినిమా రాలేదు. కానీ ప్రతిరోజూ పండగే దాదాపు 37 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ ధైర్యంతో పాటు కథ డిమాండ్ చేస్తుండటంతో భారీ బడ్జెట్‌కు సిద్ధమవుతున్నారు నిర్మాతలు.
సునీల్ హీరోగా వచ్చిన ఈడు గోల్డ్ ఎహే సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు వీరు. మధ్యలో పవన్ కళ్యాణ్, రవితేజ సినిమా ఉందనే వార్తలు వచ్చినా కూడా కుదర్లేదు. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వీలైనంత త్వరలోనే బయటికి రానున్నాయి. ఏదేమైనా కూడా మెగా మేనల్లుడు శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో నటిస్తే మాత్రం అభిమానులకు ఫుల్ కిక్ అంతే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood