లక్ష్మీస్ ఎన్టీఆర్ మూడు రోజుల కిందే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.. ఒక్క ఏపీలో తప్ప. అక్కడ విడుదల కాకపోయినా కూడా మంచి వసూళ్లనే సాధిస్తుంది ఈ చిత్రం. అయితే అక్కడ కూడా విడుదలైతేనే తమ సినిమాకు పూర్తి న్యాయం జరిగినట్లు అంటున్నారు దర్శక నిర్మాతలు. అందుకే తమ సినిమాను ఎలాగైనా ఏపీలో విడుదల చేయాలని కోరుతూ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించాడు వర్మ. ఏపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న న్యాయమూర్తులు చూసి ఫిక్స్ చేసే వరకు విడుదల చేయరాదని హై కోర్ట్ తీర్పు ఇచ్చింది.
దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయాలనే నెపంతో సుప్రీం కోర్టుకు వెళ్లిన వర్మకు అక్కడ కూడా నిరాశ తప్పలేదు. ఈ సినిమాపై విధించిన స్టే ఎత్తేయాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరగా.. అంత అర్జంటుగా విడుదల చేయాల్సిన అవసరం లేదంటూ వాళ్ల అభ్యర్థనను తిరస్కరించింది కోర్ట్. ఎలాగూ ఏప్రిల్ 3న ఈ సినిమాపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కదా.. అప్పటి వరకు ఆగండి.. ఆ తర్వాత విడుదల చేయాలా లేదంటే ఎన్నికల తర్వాత తీసుకురావాలా అనేది ఆలోచించొచ్చు అంటూ సుప్రీం ఆదేశించింది.
మొత్తానికి సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వర్మకు తాజా షాక్ ఇచ్చినట్లైంది. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నట్లు ఈ చిత్రం ఇప్పటి వరకు మూడు రోజుల్లో 6 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఈ వారంలోనే సినిమా సేఫ్ జోన్ వైపు అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Lakshmis NTR, Supreme Court, Telugu Cinema, Tollywood