కొన్ని రోజులుగా చాలా ఆరోగ్యంగా కనిపించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నట్లుంది అనారోగ్యం పాలయ్యాడు. ఈయన మరోసారి అస్వస్థతకు గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మొన్నటికి మొన్న కుటుంబంతో పాటు దివాళీ సెలబ్రేట్ చేసుకున్న ఈయనకు రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం వచ్చిందని తెలిపారు ఫ్యామిలీ మెంబర్స్. వెంటనే ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్కు తీసుకెళ్ళారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రజినీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏం లేదని తెలిపారు. కేవలం ఇది వైరల్ ఫీవర్ మాత్రమే అని.. కరోనా లాంటిది ఏం లేదని చెప్పారు. రజినీ ఆరోగ్యం పాడైపోయిందని తెలిసిన వెంటనే అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రజినీ అనారోగ్యం బారిన పడుతున్నాడు. అప్పుడప్పుడూ ఈయన ఆరోగ్యం దెబ్బతింటూనే ఉంటుంది. అందుకే అప్పట్లో ఫారెన్ కూడా వెళ్లి అక్కడ కొన్ని నెలల పాటు ఉండి చికిత్స తీసుకుని వచ్చాడు రజినీకాంత్. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన బాగానే ఉన్నాడు.
మధ్యమధ్యలో అప్పుడప్పుడూ అనారోగ్యం పాలవుతున్నా కూడా వెంటనే కోలుకుంటున్నాడు. ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది. అనారోగ్యం కారణంగానే సినిమాల సంఖ్య కూడా తగ్గించేసాడు రజినీకాంత్. ప్రస్తుతం ఈయన సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఈ మధ్యే కరోనా జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఈ చిత్ర షూటింగ్ చేస్తున్నాడు సూపర్ స్టార్. అలాంటి సమయంలోనే జ్వరం రావడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరోవైపు ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పార్టీ ప్రకటించినా ఇప్పటి వరకు రజినీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే రాలేదు. అందుకే ఆయన రావాలంటూ ఎప్పటి నుంచో అభిమానులు కోరుతున్నారు. కానీ రజినీకాంత్ దీనిపై ఏం మాట్లాడటం లేదు. ఏదేమైనా ఈయన ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Telugu Cinema, Tollywood