Super Star Krishna: ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్ మహా ప్రస్థానంలో ముగిసాయి. నటశేఖరుడి కుమారుడు మహేష్ బాబు తండ్రి చితికి నిప్పటించారు అగ్ని సంస్కారం నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరుపున పోలీసులు గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరిపి కృష్ణ పార్ధివ దేశానికి గన్ సెల్యూట్ చేశారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ తమిళ సై .. కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కృష్ణకు నివాళులు అర్పించారు. అటు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుటు నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణితో కలిసి కృష్ణ పార్దివ దేహానికి అంజలి ఘటించారు.
అటు అల్లు అరవింద్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఇక కృష్ణ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. మొత్తంగా కృష్ణ మృతిపై దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
కృష్ణ విషయానికొస్తే.. తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబాయ్ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ఓ.ఆర్.డబ్ల్యు రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (తెలుగు వీర లేవరా..).. తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లోనే మోసగాళ్లకు మోసగాడు సినిమాతో ప్యాన్ వరల్డ్ మూవీతో అలరించారు. ఈయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమ ఓ ధృవతారను కోల్పోయిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Super Star Krishna, Tollywood