Super Star Krishna - ANR - NTR | సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్, డాషింగ్, అండ్ డైనమిక్ హీరోగా తెలుగు సినిమాను ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు. ఎన్నో విషయాల్లో తెలుగు సినిమాల్లో కృష్ణ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఈయనకు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు పొడసూపాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ల లాంటి వారు. వీళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టార్డమ్ అంటే ఏమిటో పరిచయం చేసారు. వీళ్లిద్దరు ఎన్నో సినిమాల్లోకలిసి పనిచేసారు. అంతేకాదు వీళ్లిద్దరు స్టూడియోల నిర్మాణంతో తెలుగు నేలలో టాలీవుడ్ ఇండస్ట్రీ నిలదొక్కుకునేలా చేసారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి. అప్పట్లో వీళ్లిద్దరు మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ ఏదో ఇష్యూ వచ్చి జమునతో నటించకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో నాగిరెడ్డి, చక్రపాణి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, జమునల మధ్య రాజీ కుదిర్చి ‘గుండమ్మకథ’ లో జమునను ఓ హీరోయిన్గా తీసుకున్నారు.
ఆ సంగతి పక్కనపెడితే.. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.అప్పట్లో ఎన్టీఆర్ ఈ సినిమా చేయాలనుకొని.. కథ పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేకపోయింది. అప్పట్లో మహారథి ఈ సినిమాకు కథ కూడా రెడీ చేసారు. ఆ తర్వాత మహారథి చెప్పిన కథకు ఇన్స్పైర్ అయిన కృష్ణ.. ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ విషయం తెలుసుకున్న అన్నగారు.. ఈ సినిమాను చేయోద్దని చెప్పారు. అపుడు కృష్ణ.. మీరు సినిమా చేయాలనుకుంటే.. నేను చేయనన్నారు.
అపుడు అన్నగారు ఈ సినిమా నేను చేయను.. మీరు చెేయెద్దు అన్నారట. దీంతో కృష్ణ.. మహారథితో కొంచెం కమర్షియల్ హంగులు అద్ది ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా మధ్యలో దర్శకుడు వి.రామచంద్రరావు మరణించారు. ఆ తర్వాత కృష్ణ.. ఈ సినిమాలో పోరాట దృష్యాలను కే.యస్.ఆర్.దాస్‌తో తెరకెక్కించారు. మిగిలిన తానే షూట్ చేశారు. అంతేకాదు రామచంద్రరావు పై గౌరవంతో డైరెక్టర్‌గా ఆయన పేరు వేసారు.
ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు విడుదలైన కొన్ని రోజులకు ఈ సినిమా చేయాలనుకున్నారు ఎన్టీఆర్. కానీ అప్పటికే పరుచూరి బ్రదర్స్ సహా కొంత మంది కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూడమని అన్నగారికి చెప్పడంతో .. కృష్ణను పిలిపించి అల్లూరి సీతారామరాజు సినిమాను చూసి ఆయన్ని అభినందించారు ఎన్టీఆర్. అంతకు ముందు 1969లో ముల్కి నిబంధనలకు విరుద్ధుంగా జై ఆంధ్ర ఉద్యమం సమయంలో కూడా కృష్ణ .. జై ఆంధ్ర ఉద్యమానికి జై కొట్టారు. ఈ విషయమైన ఎన్టీఆర్‌తో కృష్ణకు విభేదాలు వచ్చాయి. అప్పట్లో ఎన్టీఆర్ కూడా మన సినిమా నటులకు ఈ గొడవెందుకు.. జై ఆంధ్ర ఉద్యమానికి సై అంటే తెలంగాణ మన ఆస్తులపై దాడులు చేస్తే ఎవరు దిక్కు అంటూ కృష్ణను ప్రశ్నించారట. అపుడు కృష్ణ తనకు ప్రాంతం వాళ్లు చేసేది న్యాయంగా అనిపించి వాళ్లకు సపోర్ట్ చేసానన్నారు. అప్పట్లో కృష్ణ.. ఆంధ్ర ఉద్యమానికి సపోర్ట్.. లవ్ ఇన్ ఆంధ్ర సినిమా కూడా చేసిన గట్స్ కృష్ణకే దక్కుతుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ సినిమాలో కలిసి నటించారు. అప్పట్లో రాజకీయాల్లో రమ్మని ఎన్టీఆర్ .. కృష్ణను ఆహ్వానించినా.. ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు.
అటు ఎన్టీఆర్ .. దాన వీర శూర కర్ణ సినిమా సమయంలో కృష్ణ.. కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘కురుక్షేత్రం’ సినిమా మొదలు పెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్.. ఈ సినిమా సమయంలో అన్నగారు.. కృష్ణని పిలిచి మాట్లాడారు. నేను కర్ణ సినిమా చేస్తున్నాను. మీరు అదే సబ్జెక్ట్‌తో మూవీ చేస్తున్నారు. ఇద్దరం ఒకేసారి ఒకే సబ్జెక్ట్స్‌తో సినిమా చేస్తే ఎవరో ఒకరికి నష్టం జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు సినిమా మానేయండి బ్రదర్ అంటూ కృష్ణ గారికి ఎన్టీఆర్ చెప్పారట. కానీ కృష్ణ ఈ సినిమాను నేను కాదు.. ఎ.యస్.ఆర్. ఆంజనేయులు నిర్మించారు. ఇప్పటికే ఈయనకు రూ. 2 లక్షల వరకు ఖర్చు చేసారు. ఇప్పట్లో వెనక్కి తగ్గడం భావ్యం కాదన్నారు. అలా తెలుగు సినీ అక్కినేని, ఎన్టీఆర్ తప్పించి మిగతా నటీనటులతో ఈ సినిమాను కృష్ణ సమర్ఫణలో మాధవి పద్మాలయ పతాకంపై రాజస్ఠాన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రం అన్నగారి ‘దాన వీర శూర కర్ణ’ సినిమాతో 1977లో సంక్రాంతికి ఒక్కరోజు గ్యాప్‌లో విడుదలైంది. దానవీర శూర కర్ణ సినిమా ముందు కృష్ణ.. కురుక్షేత్రం సినిమా అంతగా నడవలేదు. ఈ విధంగా అపుడు కూడా అన్నగారితో కృష్ణగారు తలపడటం ఒక్క కృష్ణ గారికే చెల్లింది.
కృష్ణ.. అప్పట్లో విజయ నిర్మలతో కలిసి ఏఎన్నార్ ఆల్ టైమ్ క్లాసిక్ .. దేవదేసు’ సినిమాను సినిమా స్కోప్‌లో రీమేక్ చేసారు. ఆ తర్వాత దేవదాసు నిర్మాత బి.ఎల్. నారాయణ మా దేవదాసు హక్కులను రూ. 25 వేలకు అమ్ముతాను తీసుకోండన్నారు. దీనికి కృష్ణ మేము.. శరత్ చంద్ర కుటుంబ సభ్యుల దగ్గర ఈ రైట్స్ తీసుకున్నాము. మాకు అది అవసరం లేదన్నారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరు రూ. 25 వేలకు ఈ సినిమా హక్కులను అన్నపూర్ణ ఫిల్మ్స్ పతాకంపై రీ రిలీజ్ చేశారు. పాత దేవదాసు సినిమాను కృష్ణ.. దేవదాసు విడుదలకు ఒక వారం ముందుగా మళ్లీ రీ రిలీజ్ చేసారు. మ్యూజికల్‌గా మంచి పాటలున్న కృష్ణ, విజయ నిర్మలల దేవదాసు.. ఏఎన్నార్ దేవదాసు ముందు తేలిపోయింది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఆ తర్వాత కృష్ణ.. అక్కినేనితో ఎలాంటి భేషజాలు పోకుండా.. హేమాహేమీలు, రాజకీయ చదరంగం వంటి తన సొంత సినిమాల్లో ఆయనతో కలిసి నటించడం విశేషం. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కృష్ణ..కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి.. ఎన్టీఆర్ పై ‘మండలాదీశుడు’,‘గండిపేట రహస్యం’, నా పిలుపే ప్రభంజనం’ వంటి పలు సెటైరికల్ మూవీస్ చేసి ఎన్టీఆర్‌కు సవాల్ విసిరారు.
ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏఎన్నార్‌తో అన్నపూర్ణ స్టూడియో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిబంధలనకు విరుధ్దంగా టింబర్ డిపో నడిపారు. ఈ విషయంలో పెద్ద ఇష్యూ నడిచింది. అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్.. అక్కినేనికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించి ప్రభుత్వ స్థలంలో ఉన్న గోడలను బుల్డోజర్తో పడగొట్టించిన సందర్భాలున్నాయి.
దీంతో ఏఎన్నారు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత అక్కినేని అక్కడ టింబర్ డిపోను తరలించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోవడం.. జరిగింది. మర్రి చెన్నారెడ్డి సీఎం అవ్వడం. ఆ స్థలాన్ని అక్కినేని క్రమకద్ధీకరించారు. ఆ తర్వాత కొన్నాళ్లుకు ఎన్టీఆర్,ఏఎన్నార్ విభేదాలు పక్కన పెట్టి మళ్లీ ఒకటైపోయారు. ఇక ఎన్టీఆర్, కృష్ణ కూడా ఆ తర్వాత మళ్లీ కలిసిన సందర్భాలున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మధ్య ఎన్ని గొడవలు ఉన్న వీళ్లు సినిమాల్లో కలిసి నటించిన సందర్భాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ANR, NTR, Super Star Krishna, Tollywood