రంగస్థలం తర్వాత సుకుమార్ రేంజ్ మారిపోయింది. ఇదివరకు కూడా సుకుమార్ అంటే క్రేజీ డైరెక్టరే కానీ రంగస్థలం తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్. ఇప్పుడు ఈయనతో సినిమా కోసం స్టార్ హీరోలు కూడా క్యూ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. మహర్షి తర్వాత ఈ కాంబినేషన్ పట్టాలెక్కనుంది. నేనొక్కడినే తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ వస్తుంది. అప్పటి బాకీ ఇప్పుడు తీర్చేస్తానంటున్నాడు సుకుమార్.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా కూడా చేయబోతున్నాడు ఈ దర్శకుడు. అయితే దర్శకుడిగా మాత్రం కాదు.. నిర్మాతగా. ఇప్పటికే కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకుడిగా నితిన్ హీరోగా ఓ సినిమా నిర్మించబోతున్నాడు సుకుమార్. ఇక ఈ చిత్రంతో పాటు ఇప్పుడు నాగశౌర్య హీరోగా మరో సినిమాను కూడా ఈయన నిర్మిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ఈ చిత్రానికి కథ మాత్రం సుకుమార్ అందిస్తున్నాడు.
సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఇప్పటికే ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టి అందులో సినిమాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు కూడా నితిన్, నాగశౌర్య లాంటి కుర్ర హీరోలతో తను ఐడియాలు, కథలు ఇస్తూ వరస సినిమాలు నిర్మాణం చేస్తున్నాడు సుకుమార్. ఓ వైపు దర్శకుడిగా.. మరోవైపు నిర్మాతగా.. ఇంకోవైపు రచయితగా అన్ని రంగాల్లోనూ బిజీగా ఉన్నాడు సుకుమార్. మరి ఈ సైడ్ బిజినెస్ లో పడి మెయిన్ బిజినెస్ కు దెబ్బపడకపోతే అదే పదివేలు అంటున్నారు అభిమానులు. మరి చూడాలిక.. సుకుమార్ ఈ విషయంలో ఎంతవరకు జాగ్రత్త పడతాడో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga shourya, Telugu Cinema